
‘బుచ్చి అప్పారావు’ విగ్రహం ఏర్పాటులో రాజకీయం..!
● విగ్రహావిష్కరణలో విభేదాలు, వసూళ్ల వివాదం
విజయనగరం అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరుతో గంట్యాడ మండలంలోని తాడిపూడి రిజర్వాయర్ ప్రాంతంలో సోమవారం జరుగనున్న విగ్రహ ఆవిష్కరణ రాజకీయ రంగుదాల్చింది. తూర్పు కాపు–కొప్పుల వెలమ సంఘాల మధ్య విభేదాలు, పాత ప్రభుత్వాల నిర్ణయాలపై కొత్త పాలకుల వైఖరి, చందాల వసూళ్ల వివాదం ఈ కార్యక్రమాన్ని చర్చనీయాంశంగా మర్చాయి. స్వాతంత్య్ర సమరయోధుడి స్ఫూర్తి చుట్టూ రాజకీయ లెక్కలు, సంఘాల విఽభేదాలు, చందాల వసూళ్లు వెరసి ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేశాయి.
వైఎస్సార్‌సీపీ పాలనలో మొదలైన ప్రణాళిక
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో తాడిపూడి రిజర్వాయర్‌కు గొర్రిపాటి బుబ్బి అప్పారావు పేరు పెట్టాలన్న ప్రతిపాదన కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు సమర్పించగా ఆ వినతిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదించి ప్రత్యేక జీఓ జారీ చేసింది. సంఘం జిల్లా కమిటీ కోరిన మేరకు మాజీ ఎమ్మెల్సీ బొత్స అప్పలనరసయ్య ఆర్థిక సహకారంతో దాదాపు రూ.10 లక్షల వ్యయంతో బుచ్చి అప్పారావు విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహానికి స్థలాన్ని కూడా గత ప్రభుత్వం ఎంపిక చేసి ఇచ్చింది. ఆ స్థలంలో సంఘం ప్రతినిధులు శంకుస్థాపన పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం పాలకపక్షం మారింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ కాపు నేతలు విగ్రహస్థాపన ప్రయత్నాన్ని జరగనీయలేదు సరికదా ఆ జీఓను రద్దు చేయించారు. కొప్పుల వెలమ సంఘం గత నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పాలనలో పలుమార్లు వినతులు సమర్పించినా ఏనాడూ స్పందన రాలేదు. అదే కులానికి చెందిన అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ డిమాండ్ పట్టించుకోలేదని సంఘం నాయకులు చెబుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో జిల్లా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఎదుర్కోలేక చివరికి కూటమి ప్రభుత్వానికి మళ్లీ కొత్త జీఓ జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు మరో విగ్రహం–మరో కథ
కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ వ్యవహారంలో కలుగచేసుకుని కొత్త విగ్రహం తయారు చేయించే ప్రతిపాదన తెచ్చారు. అయితే తొలి నుంచి తమ కులానికి చెందిన సమరయోధుడిగా ఆరాధిస్తూ తాడిపూడి రిజర్యాయర్‌కు ఆయన పేరు పెట్టాలని పట్టుపడుతూ ఆయన విగ్రహాన్ని పెట్టాలని కృషి చేసిన కొప్పుల వెలమ సంక్షేమ సంఘాన్ని పక్కను పెట్టి తెలుగుదేశం పార్టీలో స్థానిక మరో కులం తూర్పుకాపు నాయకుల కార్యక్రమంగా తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త విగ్రహం పేరుతో చందాల వసూలు
కొప్పుల వెలమ సంఘం రూ.10 లక్షల వ్యయంతో సిద్ధం చేసిన విగ్రహాన్ని కాదని కొత్త విగ్రహం ఆవిష్కరణ పేరుతో ప్రజల నుంచి వసూళ్ల దందాకు తెరలేపారు. తాడిపూడి రిజర్వాయర్ పరిధిలోని గంట్యాడ, జామి మండలాల గ్రామ ప్రజలు, ఉద్యోగుల నుంచి భారీగా చందాలను బహిరంగంగానే వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల వారీగా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలు టార్గెట్ ఇచ్చి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు గ్రామాల్లో ఈ వసూళ్లపై ప్రజల నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

‘బుచ్చి అప్పారావు’ విగ్రహం ఏర్పాటులో రాజకీయం..!