
సర్వజన ఆసుపత్రిలో రోగుల కష్టాలు..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సకాలంలో రోగులకు వైద్య సేవలు అందక అవస్థలు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ వైద్య సేవలు అందించేగలిగే వాటిని కూడా వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ చాలా వైద్య సేవలు గగనంగా మారాయనే అపవాదు ఉంది.
రాత్రి సమయంలో అందుబాటులో ఉండని
స్పెషాల్టీ వైద్యులు
రాత్రి పూట స్పెషాల్టీ వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ వైద్యులు, పీజీ వైద్యులే రోగులకు పెద్దదిక్కుగా నిలుస్తున్నారు. వాస్తవంగా స్పెషాల్టీ వైద్యులు రాత్రి వేల ఆసుపత్రిలో ఉండాలి. కానీ గత కొంత కాలంగా స్పెషాల్టీ వైద్యులు ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాయంత్రం 4 గంటల తరువాత అందని
అల్ట్రా సౌండ్ సేవలు
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సాయంత్రం 4 గంటల తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట తీవ్రమైన కడుపునొప్పి, కడుపులో తీవ్రమైన మంటతో వచ్చే వారికి అత్యవసరంగా అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడం వల్ల మరుసటి రోజు ఉదయం 9, 10 గంటలకు వైద్యులు వచ్చే వరకు నొప్పితోనే రోగులు నిరీక్షించాల్సిన పరిస్థితి.
1200 వరకు ఓపీ
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీకి 1000 నుంచి 1200 మంది వరకు రోగులు వస్తున్నారు. అదే విధంగా 60 నుంచి 80 మంది వరకు ఇన్‌పేషంట్లుగా రోగులు చేరుతున్నారు.
రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటాం..
ఆసుపత్రిలో చికిత్స చేయగలిగే రోగులకు ఇక్కడే సేవలు అందిస్తారు. చికిత్స అందివ్వగలిగే వారిని రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటాం. రాత్రి సమయంలో జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజీషియన్ విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాం. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్ అత్యవసరం అనుకుంటే వైద్యులు వచ్చి స్కాన్ చేయాలి. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ సంబంగి అప్పలనాయుడు,
సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి
రాత్రి వేళ మరింత కష్టాలు
స్పెషాల్టీ వైద్యులు అందుబాటులో ఉండని వైనం
అధిక శాతం వైద్యులు విశాఖ నుంచి రాకపోకలు
రిఫరల్స్ ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు
విశాఖ నుంచి రాక పోకలు
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులంతా స్థానికంగా ఉండాలి. కానీ అధిక శాతం మంది వైద్యులు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం అందరూ స్థానికంగా ఉండాలి. ఎందుకంటే వీరు హోమ్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉండకపోయినప్పటకీ తప్పడు అడ్రస్‌లు చూపించి హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పెషాల్టీ వైద్యులు అవసరం ఎంతో ఉంటుంది. రోగులు ప్రాణాలు కాపాడడంలో వీరిదే ప్రధాన పాత్ర. వీరు అందుబాటులో ఉంటే రోగులకు సకాలంలో వైద్యం అందించడానికి వీలుంటుంది.
రిఫరల్స్ ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యం అందించే గలిగే పరిస్థితి ఉన్నప్పటకీ కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా రిఫరల్స్ చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషాల్టీ వైద్యులు రాత్రి సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల తమకెందుకు వచ్చిన రిస్క్ అనుకుని రిఫర్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ రోజు ఇక్కడి ఆసుపత్రి నుంచి మూడు నుంచి నాలుగు రిఫరల్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

సర్వజన ఆసుపత్రిలో రోగుల కష్టాలు..!