
సర్వజన ఆస్పత్రిలో ఫార్మసిస్టుల కొరత..!
● ఏడాదిన్నరగా పోస్టులు ఖాళీ
● భర్తీ చేయని ప్రభుత్వం
● ప్రస్తుతం ఉన్నది 10 మంది
● మరో 15 మంది అవసరం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫార్మసిస్టులు (ఫార్మసీ ఆఫీసర్లు) పూర్తిస్థాయిలో లేక పోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్న వారిపైనే అధిక భారం పడుతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఆస్పత్రి నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారిన నేపథ్యంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పెరిగాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగింది. రోగులకు చికిత్స అందించే వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం ఫార్మసిస్టులకు ఉంది. వైద్యులు రాసి ఇచ్చిన మందులు అందించేంది ఫార్మసిస్టులే. అయితే వారి సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. రోగుల సంఖ్యకు తగ్గట్టు ఫార్మసిస్టులను నియమించడంలో కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏడాదిన్నరగా భర్తీ కాని ఖాళీలు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 11 మంది ఫార్మసిస్టులు ఉండేవారు. వారిలో ఒకరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏడాదిన్నరగా అపోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది.
మరో 15మంది అవసరం
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుతం 10 మంది ఫార్మసిస్టులు ఉన్నారు. ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి ఇంకా 15 మంది వరకు ఫార్మసిస్టులు అవసరం. జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి 500 నుంచి 600 వరకు ఓపీ వచ్చేది. ఇప్పడు 1200 నుంచి 1400 వరకు ఓపీ వస్తోంది. 24 గంటల పాటు ఫార్మసిస్టులు సేవలు అందించాల్సి ఉంటుంది. మూడు షిఫ్టుల్లో ఫార్మసిస్టులు సేవలు అందిస్తారు.
సర్వజన ఆస్పత్రిలో ఓపీ వివరాలు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎన్‌సీడీ, ఈఎన్‌టీ, డెంటల్, పలమనాలజీ, న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, ఎముకలు, చర్మ, మానసిక, ఏఆర్‌టీ, అంకాలజీ, కంటి విభాగాలు ఉన్నాయి.
గత ప్రభుత్వంలో వెకెన్సీ ద్వారా పోస్టుల భర్తీ
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోస్టులను ఎప్పటికప్పడు భర్తీ చేశారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో 50 వేలకు పైగా పోస్టుల భర్తీ జరిగింది. పీహెచ్‌సీ నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ఏ ఆస్పత్రిలో నైనా పోస్టు ఖాళీ అయితే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేవారు. కాని ఇప్పడా పరిస్థితి లేదు. పోస్టు ఖాళీ అయితే ఏడాదిన్నర అయినా భర్తీ చేసిన దాఖలాలు లేవు.

సర్వజన ఆస్పత్రిలో ఫార్మసిస్టుల కొరత..!