
ఎన్నికల సమయంలోనే స్వాధీనం
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాటు తుపాకీల వినియోగం ఇటీవల కాలంలో అధికమైంది. వాటి తో ప్రత్యర్థుల ప్రాణాలు తీస్తుండడం సామాన్య ప్రజానీకంతో పాటు పోలీస్ వర్గాలను కలవర పెడుతోంది. గతంలో తమ పంటలను కాపాడుకోవడానికి.. అడవి జంతువుల నుంచి రక్షణకు ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు వీటిని అనధికారికంగా వాడేవారు. కొన్నాళ్లుగా వీటి జాడ లేదు అనుకుంటున్న సమయంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు నాటు తుపాకీ కాల్పులకు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. అనుమతులు లేకుండా వీటిని వాడడం చట్ట విరుద్ధం అయినప్పటికీ.. కొందరు చట్టాన్ని విస్మరిస్తున్నారు.
నాడు రక్షణకు.. నేడు ప్రతీకారానికి!
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో అడవి పందుల నుంచి పంటలను కాపాడుకోవడానికి.. వాటిని వేటాడేందుకు నాటు తుపాకులు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కొన్ని మైదాన ప్రాంతాల్లో కూడా ఇవి లభ్యమవుతుండడం గమనార్హం. గంజాయి, సారా తరలింపు సమయంలో వన్య ప్రాణుల నుంచి రక్షణ కోసం నాటు తుపాకులను వెంట ఉంచుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు అక్రమ వ్యాపారానికి ఎవరూ అడ్డు రాకుండా ఆయుధాలను కూడా సమకూర్చుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు పచ్చని పల్లెల్లో పగలు, ప్రతీకారాలకు వీటిని వాడుతుండడం ఆందోళన కలిగించే అంశం. మందుగుండుకు ఉపయోగించే సామగ్రిని తుపాకీ గుళ్లుగా వాడుతున్నారు. తయారీలో సీసా పెంకులు, ఇతర పేలుడు పదార్థాలను వినియోగిస్తుండటం వల్ల మనిషికి తగిలిన వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు.
రెండు జిల్లాల్లో ముమ్మరంగా కార్డన్ సెర్చ్
నాటు తుపాకులు, గంజాయి, సారా కట్టడికి అటు విజయనగరం జిల్లాతోపాటు.. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఎస్.కోట, వేపాడ, బాడంగి, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. వేపాడ, పార్వతీపురం ప్రాంతాల్లో కొన్ని చోట్ల అనధికారికంగా కలిగి ఉన్న నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
రావివలసలో పోలీసు సోదాలు
గిరిజన ప్రాంతాల్లో నాటు తుపాకీల
వినియోగం
క్షణికావేశంలో హత్యలు
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
ముమ్మరంగా కార్డన్ సెర్చ్
ప్రస్తుతం అధికారులు నాటు తుపాకీలకు అనుమతులు ఇవ్వడం మానేశారు. సార్వత్రిక, స్థానిక ఎన్నికల సమయంలో లైసెన్సుడు తుపాకీలను పోలీస్ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఆ సమయంలో నాటు తుపాకీల మీద కూడా నిఘా ఉంచేది. తాజాగా జరుగుతున్న కాల్పులతో పోలీసు శాఖ ఉలిక్కి పడింది.
బాడంగి: మండలంలోని అల్లవానివలస పంచాయతీ శివారు గ్రామమైన రావివలసలో నాటుతుపాకీలున్నాయన్న సమాచారంతో బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో పోటీలసులు శుక్రవారం ఇంటింటా సోదాలు జరిపారు. గతంలో రావివలసలోని ఎస్.టి.దొరలు, ఎరుకలవారు అడవిమృగాల నుంచి రక్షణకోసం నాటు తుపాకులు వినియోగించేవారు. ఆ మేరకు గ్రామంలో సోదాలు చేశారు. అయితే, పోలీసులకు ఎలాంటి నాటుతుపాకీలు దొరకలేదు. గ్రామస్తులకు నాటుతుపాకీ కలిగి ఉండడం వల్ల కలిగే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్యలపై సీఐ అవగాహన కల్పించారు. ఈ సోదాలో సీఐతో పాటు బాడంగి, తెర్లాం, రామభద్రపురం ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా అప్పగించాలి..
నాటు తుపాకుల ఏరివేత, సారా, గంజాయి కట్టడి లక్ష్యంగా గుర్తించిన ఏజెన్సీ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. నాటు తుపాకులు కలిగి ఉండడం, వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గిరిజనులకు అవగాహన కల్పించాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశించాం. తుపాకులు కలిగి ఉండడం ఇండియన్ ఆర్మీ యాక్టు ప్రకారం తీవ్రమైన నేరం. ఎవరి వద్దనైనా ఉన్నట్లయితే స్వచ్ఛందంగా అప్పగించాలి.
– వకుల్ జిందల్/ఎస్.వి.మాధవ్ రెడ్డి,
విజయనగరం,
పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు

ఎన్నికల సమయంలోనే స్వాధీనం

ఎన్నికల సమయంలోనే స్వాధీనం