
అరకొర బస్సులతో ఉచిత ప్రయాణమా?
విజయనగరం అర్బన్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అందించే విధానం ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. జిల్లాలో ఉన్న మహిళల సంఖ్యకు సరిపడే బస్సులు లేకపోవడం వల్ల వాటి నిర్వహణ సాధ్యాసాధ్యాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని వాపోతున్నారు. ప్రస్తుతం అరకొర సంఖ్యలోని బస్సులతో ప్రయాణ సేవలు ఎలా అందజేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త బస్సులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం కొత్త బస్సులపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. మరోవైపు ఎప్పటికప్పుడు కాలంచెల్లిన బస్సులు వినియోగానికి దూరమవుతున్న నేపథ్యంలో రద్దయిన రూట్లకు కూడా బస్సులు వేయమని ఆయా ప్రాంతాల స్థానికుల నుంచి ఒత్తిడి తప్పదని ఆందోళన చెందుతున్నారు.
ఉన్నవి 160 బస్సులే..
జిల్లాలోని 27 మండలాల పరిధిలో 934 పంచాయతీలున్నాయి. వీటిలో రోడ్డురవాణా సౌకర్యం ఉన్న 70 శాతం గ్రామాల్లో 40 శాతం గ్రామాలకే బస్సు రూట్లు అధికారికంగా ఉన్నాయి. ప్రస్తుతం అమలు చేయబోతున్న మహిళల ఉచిత ప్రయాణ పథకం ఆయా గ్రామాలకు మాత్రమే పరిమితం కానున్నాయి. జిల్లాలోని అందుబాటులో ఉన్న 160 బస్సులలో విజయనగరం డిపో పరిధిలో 116, ఎస్.కోట డిపో పరిధిలో 44 సర్వీసులు నడుస్తున్నాయి. ఏడాది కిందటి వరకు విజయనగరం డిపోలోనే 150 వరకు బస్సులు ఉండేవి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు వేయకపోవడం వల్ల వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న 160 బస్సుల ద్వారా రోజుకు 49వేల మంది ప్రయాణికులకు మాత్రమే రవాణా సేవలు సాధ్యమవుతున్నాయి. జిల్లాలోని మహిళా ఓటర్ల సంఖ్య 7.7లక్షలు ఉండగా, మహిళా ఓటర్లలో 10 శాతం ప్రయాణం చేసినా బస్సుల సామర్థ్యం సరిపడదని ఆర్టీసీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.
కొన్ని కేటగిరీ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం
మహిళలకు ఉచిత ప్రయాణం కొన్ని ఆర్టీసీ సర్వీసులకే ప్రభుత్వం పరిమితం చేసింది. సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్ సర్వీసులకు ఉచిత ప్రయాణం అర్హత లేదు. రోజుకు 160 బస్సులు 62,843 కిలోమీటర్ల మేర సర్వీసులు అందిస్తే, వాటిలో 10,864 కిలోమీటర్ల మేర ఉచిత రవాణా అర్హతలేని 23 బస్సు సర్వీసులు ఉన్నాయి. మిగిలిన 51,979 కిలోమీటర్ల దూరం సేవలు మాత్రమే ఎక్స్‌ప్రెస్, మెట్రో, ఆల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు వంటి బస్సులలో అందుతాయి. జిల్లాలోని బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, విజయనగరం, రాజాం, చీపురుపల్లి మధ్యలోనే మహిళలకు నిత్యం ప్రయాణ అవసరాలుంటాయి. అయితే, ఆయా రూట్లలో ఉచిత ప్రయాణం అర్హత లేని ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీలే అత్యఽధింగా ఉన్నాయి. అరకొర ఉన్న మిగిలిన బస్సుల కోసం పడిగాపులు తప్పవు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్
జిల్లాలో 27 మండలాలకు రెండు
డిపోలలో ఉన్న బస్సులు 160 మాత్రమే..
కొన్ని కేటగిరీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అవకాశం
ప్రస్తుతం రోజుకు 49 వేల మంది ప్రయాణికలకు జిల్లాలో రవాణా సామర్థ్యం
జిల్లాలో 40 శాతం పంచాయతీలకు మాత్రమే ఆర్టీసీ రవాణా సేవలు

అరకొర బస్సులతో ఉచిత ప్రయాణమా?