
టిడ్కో గృహాలకు గ్రహణం
● కూటమి పాలనలో ముందుకు సాగని ఇళ్ల నిర్మాణం
● రాజన్నదొర కృషితో సాలూరులో తొలిసారిగా.. టిడ్కో ఇళ్ల
గృహప్రవేశాలు
సాలూరు: గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో సొంత ఇల్లు అంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చాలా కష్టమైన పని. అటువంటి పేదవాడి సొంతింటి కలను సాలూరు పట్టణంలో సాకారం చేసిన అంశంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెరగని ముద్ర వేసుకున్నారు. ఓ వైపు టిడ్కో ఇళ్లతో పాటు మరోవైపు నెలిపర్తి, గుమడాం తదితర ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు మంజూరు చేయించి పేదవాడికి సొంత గూడుకు తనవంతు భగీరథ ప్రయత్నం చేశారు.
గతం ఘనం–నేడు దైన్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో శరవేగంగా జరిగిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు తుది దశ మౌలిక వసతుల పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమలు కావడంతో పనులు నిలిచిపోయాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో టిడ్కో గృహాల నిర్మాణాల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోందని ప్రజలు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పాలనలో టిడ్కో గృహాల నిర్మాణాలపై పాలకులు, అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేకపోవడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఉమ్మడి విజయనగరంలో జిల్లాలోనే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందించి గృహప్రవేశాలు జరిగింది సాలూరు నియోజకవర్గంలోనే కావడం విశేషం.
రూ.82.85 కోట్లతో ఇళ్ల నిర్మాణం
టిడ్కో ఇళ్ల నిర్మాణాలు రూ.82.85 కోట్లతో పూర్తయ్యాయి. ఇందులో 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వంలో పునాదులు అంతకన్నా తక్కువ దశలో నిర్మాణాలు చేసి వదిలేయగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.70.28 కోట్లు ఖర్చు పెట్టి ఇళ్లతో పాటు మౌలిక వసతులు కల్పించింది.
రివర్స్ టెండరింగ్ ద్వారా
కేవలం పునాదులు అంతకంటే తక్కువ స్థాయి దశలో నిర్మాణంతో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం విడిచిపెట్టిన సాలూరు టిడ్కో ఇళ్లకు గత వైఎస్సార్సిపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ జరిగింది.1 చదరపు అడుగుకు నాటి టీడీపీ ప్రభుత్వం రూ.2,200లకు టెండర్లు పిలవగా, రివర్స్ టెండరింగ్ ద్వారా గత జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రూ.1,700లకే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టారు.
ఒక్కక్కరి తలపై రూ.7లక్షల అప్పు
గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల లబ్ధిదారుల తలపై సుమారు రూ.7లక్షలు అప్పు పెట్టాలని చూస్తే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సుమారు రూ.10 లక్షల విలువైన మౌలిక వసతులతో కూడిన ఇళ్లను ఉచితంగా అందించారని పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి.
పనులు పూర్తి చేయాలి
కూటమి ప్రభుత్వంలో నేటికీ పనులు పూర్తిచేయలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉన్నాయని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దాదాపు పూర్తయిన ఈ టిడ్కో గృహాలకు మౌలిక వసతులు పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు.

టిడ్కో గృహాలకు గ్రహణం

టిడ్కో గృహాలకు గ్రహణం