
18.8 మెట్రిక్ టన్నుల ఎరువుల సీజ్
తెర్లాం: మండలంలొని తెర్లాం, సుందరాడ గ్రామాల్లో గల ఎరువుల దుకాణాల్లో అనుమతి పత్రాలులేకుండా నిల్వఉంచిన 18.8మెట్రిక్ టన్నుల ఎరువులను జిల్లా వ్యవసాయధికారి వి.తారకరామారావు సీజ్‌చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మండలంలోని తెర్లాం, సుందరాడగ్రామాలలో గల ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఎరువుల దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరువు లను, స్టాక్ రికార్డులు, అనుమతిపత్రాలను పరిశీలించారు. సుందరాడ లోని సూర్యచంద్ర ట్రేడర్స్‌లో నిల్వ ఉన్న 8.5 మెట్రిక్ టన్నుల యూరియాకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్‌చేశారు. అలాగే తెర్లాంలోని శ్రీరామ ట్రేడర్స్‌లో నిల్వ ఉన్న 10.3మెట్రిక్ టన్నుల యూరియాకు ఎటువంటి ఆనుమతిపత్రాలు లేకపోవడంతో వాటిని కూడా సీజ్ చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గల ఎరువుల దుకాణాల్లో విక్రయిస్తున్న ఎరువులకు సంబంధించిన ఆనుమతి పత్రాలు లేకపోతే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా లైసెన్సులు రద్దుచేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరతలేదని, రైతుసేవా కేంద్రాల్లో నిల్వలు ఉంచామని చెప్పారు. ఆయనతో పాటు ఏఓ బొత్స శ్రీనివాస రావు ఉన్నారు.
తెర్లాం, సుందరాడలోఎరువుల దుకాణాల తనిఖీ