
ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు నష్టం
విజయనగరం గంటస్తంభం: లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్‌కు వాహన మిత్ర రూ.15,000 తక్షణమే చెల్లించాలని కోరుతూ..విజయనగరం జిల్లా శ్రీ కనకదుర్గ ఆటో మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కో–కన్వీనర్ ఎ.జగన్మోహన్‌రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి, నగర కార్యదర్శి బి.రమణ, ఉపాధ్యక్షుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ..కరోనా తర్వాత ఆటో, టాటా ఏసీ మ్యాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, తమిళనాడులో అనుభవాలను పరిశీలించి ఇక్కడ నష్టపోతున్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ చూపాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్‌కు వాహన మిత్ర రూ.15,000 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వాహన రెన్యువల్ ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఆర్టీవో అధికారులు చేయాలని, వేదాంత ప్రైవేట్ ఫిట్‌నెస్ సెంటర్‌ను రద్దు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చాలానా లు, పెట్టి కేసులు ఆపాలని, ఆటోల నిలుపుదలకు పార్కింగ్ స్ధలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో ప్రజల జీవన విధానంలో భాగంగా మారిందని అత్యవసర, నిత్యావసర సర్వీసులన్నీ అందిస్తున్నామని ఈ రంగాన్ని ఆదాయ వనరుగా భావించకుండా సర్వీస్ రంగంగా గుర్తించి ఆటోల కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బి.పాపారావు, జి.కూర్మారావు, రామారావు, భాస్కరరావు, ప్రసన్న, లక్ష్మణరావు, రాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.