
కలెక్టరేట్ వద్ద హమాలీల ధర్నా
విజయనగరం గంటస్తంభం: హమాలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద హమాలీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ముల్లు నర్సింహులు మాట్లాడుతూ..విజయనగరం జిల్లాలో గల 8 ఎంఎల్‌ఎస్ పాయింట్‌లలో సుమారు 200 మంది హమాలీలు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ పని భారం పెరుగుతూనే ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి కూలి రేట్లు పెంచుతున్నా వచ్చే కూలితో తమ కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉందని హమాలీలు వాపోయారు. మా పనిలో ప్రధానంగా చాలా సమస్యలున్నాయని, అందులో ముఖ్యంగా ప్రతినెలా స్టేజ్–2 బిల్లు 10వ తేదీలోపు ఇప్పించాలని, అన్‌లోడింగ్ బిల్లు కాంట్రాక్టర్ పేరుతో కాకుండా మా ఖాతాలోనే జమ చేసి, 15వ తేదీ లోపు ఇప్పించాలని కోరారు. అన్‌లోడింగ్ పనిని 30ఏళ్లుగా మేమే చేస్తున్నాం కాబట్టి మమ్మల్నే కొనసాగిస్తూ..మోత కూలి పెంచాలని డిమాండ్ చేశారు. హమాలీలకు చదువు లేనందున బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, వారానికి ఒకరోజు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను తీర్చని యెడల ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి పి.కామేశ్వరరావు, హమాలీ సంఘం కార్మికులు పాల్గొన్నారు.