
ఎరువుల విక్రయాల నిలిపివేత
● ఫారం ఓ లేకపోవడంతో నిలిపివేసిన అధికారులు ● తనిఖీల్లో బయటపడ్డ లోపాలు
తెర్లాం: తెర్లాంలోని శ్రీరామ ట్రేడర్స్‌లో ఎరువుల విక్రయానికి సంబంధించి ఫారం–ఓ లేకపోవడంతో 23 టన్నుల ఎరువుల విక్రయాలను నిలిపివేయాలని సంబంధిత డీలర్‌కు నోటీసులు జారీ చేసినట్టు బొబ్బిలి ఏడీఏ ఎం.మధుసూధన్ తెలిపారు. తెర్లాంలోని ఎరువుల దుకాణాల్లో బొబ్బిలి ఏడీఏ, మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లో ఎరువుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. స్థానిక శ్రీరామ ట్రేడర్స్‌లో లైసెన్స్‌కు ఫారం–ఓ లేకపోవడంతో ఎరువుల దుకాణంలో నిల్వ ఉన్న 23టన్నుల ఎరువులను విక్రయించకుండా డీలర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ డీలర్లు ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని సూచించారు. ఎరువుల దుకాణాల్లో నిల్వ ఉన్న, విక్రయిస్తున్న ఎరువులకు సంబంధించి అన్ని రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాల ద్వారా విక్రయించే ఎరువులకు సంబంధించి బిల్లు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్‌లు, ఇతర సంబంధిత పత్రాలు డీలర్లు ఉంచుకోవాలన్నారు. ఎరువుల దుకాణాల డీలర్లు రైతులకు ఏవిధంగా ఎరువులు విక్రయించాలో వివరించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు, ఏఈవో వెంకటేష్ ఉన్నారు.