
పిల్లల్లో తగ్గుతున్న పెరుగుదల..!
● 6 ఏళ్ల లోపు పిల్లలు 67,381
● బరువు తక్కువగా ఉన్న పిల్లలు 3,569
● ఎత్తు తక్కువ ఉన్న పిల్లలు 7,316
● పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు 2,410
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వేలాది మంది పిల్లలు పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. పౌష్టికాహార లోపంతో పాటు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు అధికంగా ఉన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. పౌష్టికాహార లోపం బారిన పడడం వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి మాతాశిశు ఆరోగ్యానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఫలితం ఇవ్వడం లేదు. పుట్టే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, పుట్టినట్లయితే సమస్యలు ఉండవు. పౌష్టికాహార లోపం వల్ల పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. తల్లులు బలహీనంగా ఉండడం, గర్భస్థ సమయంలో అనారోగ్యానికి గురికావడం, తక్కువ వయస్సులో వివాహాలు చేయడం, మహిళల్లో రక్తహీనత తదితర కారణాల వల్ల పుట్టే పిల్లల్లో కొంతమంది పౌస్టికాహార లోపం, బరువు తక్కువగా పుడుతున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 292 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 67,381 మంది ఆరేళ్ల లోపు పిల్లలు ఉన్నారు.
ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలు 7,316 మంది
జిల్లాలో ఉన్న ఆరేళ్ల లోపు పిల్లల్లో 7,316 మంది ఎత్తు తక్కువగా ఉన్నారు. అదేవిధంగా బరువు తక్కువగా ఉన్న వారు 3,569 మంది ఉన్నారు. 2410 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు.
ఎత్తు, బరువు తూనిక:
పిల్లల బరువు, ఎత్తు తెలుసుకునేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పరికరాల ద్వారా తూనిక వేస్తారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ప్రత్యేక పౌష్టికాహారం
6 నెలల లోపు పిల్లలు బరువు తక్కువగా ఉన్నా, పౌష్టికాహార లోపం ఉన్నా తల్లిపాలు ఆరు నెలలు పాటు తాగించాలని అంగన్వాడీ కార్యకర్త పిల్లవాడి ఇంటికి వెళ్లి తల్లికి చెబుతారు. 6 నెలలు దాటిన పి ల్లలకు అయితే తల్లిపాలతో పాటు బాలామృతం, 100 ఎంఎల్ పాలు, గుడ్డు ఇస్తారు. ఇటువంటి వారికి ఆహారాన్ని రోజులో 8 సార్లు ఇస్తారు.
ప్రత్యేక శ్రద్ధ
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పౌష్టికాహార లోపం, బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను పౌష్టికాహార లోపం ఉన్నట్లు గుర్తించి వారికి ప్రత్యేకమైన పౌష్టికాహారాన్ని అందిస్తాం. సాధారణంగా ప్రతి వ్యక్తి రోజులో మూడు సార్లు ఆహారంగా తీసుకుంటారు. కాని పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు రోజులో 8 సార్లు ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.
టి.విమలారాణి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్

పిల్లల్లో తగ్గుతున్న పెరుగుదల..!

పిల్లల్లో తగ్గుతున్న పెరుగుదల..!