
రహదారి నిర్మాణం పూర్తి
పార్వతీపురం రూరల్: మండలంలోని బాగుజోల నుంచి చిలకమెండంగి వరకు రహదారి పనులు పూర్తయినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. రూ.2.50 కోట్ల వ్యయంతో ఈ రహదారి పనులు చేశామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా రఫ్ స్టోన్ ప్యాకింగ్, తారు రహదారిగా మార్చే పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. రహదారి సౌకర్యం లేని గిరిజన ప్రాంతాలకు రహదారులు కల్పించే దిశగా గత ఏడాది డిసెంబర్ 20న మక్కువ మండలం బాగుజోలలో పలు రహదారులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు ద్విచక్ర వాహనాలు, అంబులెన్‌న్సులు, జీపులు, కార్లు వంటి వాహనాలు తిరిగేందుకు అనువుగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. రెండు కోట్ల రూపాయల విలువ మేరకు పనులు జరిగాయని, ఇందులో రూ.56 లక్షలు చెల్లింపు జరిగిందని తెలియజేశారు. మిగిలిన మొత్తం చెల్లింపు చేయాల్సి ఉందన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో రూ.360 లక్షల వ్యయంతో పాములగీసడ నుంచి మంత్రజోల వరకు 3.60 కి.మీ మేర బీటీ రోడ్డు పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తిచేయనున్నట్లు చెప్పారు. 8 కిలోమీటర్ల వరకు మట్టి రహదారి నిర్మాణం జరిగిందన్నారు. సాలూరు మండలం బాగుజోల నుంచి సిరివర వరకు 6.60 కిలో మీటర్ల మేర తారు రహదారి వేసేందుకు ప్రభుత్వం రూ.9 వందల లక్షలు మంజూరు చేసిందని, మట్టి రహదారి నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి రహదారి నిర్మాణం పూర్తవుతుందన్నారు. పాచిపెంట మండలం అల్లూరు నుంచి రిట్టపాడు వరకు గల రహదారి రూ.నాలుగు వందల లక్షలతో తారు రహదారిగా నిర్మించేందుకు మంజూరైందని, అటవీ అనుమతులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్