
మేతకు వెళ్లిన 18 గొర్రెల మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని బందలుప్పి గ్రామ సమీపంలో బందలుప్పి నుంచి తాళ్లబురిడి గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు మార్గంలో మధ్యలో ఉన్న నీలగిరి తోటల్లోకి మేతకు వెళ్లిన 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బాధిత గొర్రెల కాపరులు నీలబోను గోవింద, చందపు సింహాద్రి తెలిపిన వివరాల ప్రకారం..ఎప్పటిలాగానే తాము పెంచుకుంటున్న గొర్రెలు, మేకలను ఆదివారం సాయంత్రం శ్రీనివాసరావు అనే రైతు నీలగిరి తోటకు తరలించామని, ఆ తోటకు క్రిమిసంహారక మందులు, యూరియా పిచికారీ చేయడంతో ఈ విషయం గమనించకుండా పశుగ్రాసం కోసం మేకలు, గొర్రెలను విడిచిపెట్టామన్నారు. అవి తోటలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఒకసారిగా 18 గొర్రెలు మృత్యువాత పడడంతో గమనించి స్థానిక పశు వైద్యుడికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు పశువైద్యుడు రెడ్డి రమేష్ చేరుకుని గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గొర్రెల మృతి కారణంగా తీవ్రంగా నష్టపోవడంతో కాపరులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మరో 20 గొర్రెలకు అస్వస్థత