
ఎరుపెక్కిన బొబ్బిలి..
బొబ్బిలి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ మినిస్టర్ అమిత్‌షాలకు ఖరీదైన విమానాల్లో విదేశాల్లో తిరగడానికి ఉన్న శ్రద్ధ మనదేశంలో మణిపూర్‌లో దాడులకు గురైన మహిళలను పరామర్శించేందుకు లేకపోవడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాండ్ర పాపారాయ జంక్షన్‌లో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మణిపూర్ మహిళలపై దారుణంగా హింసలు చోటు చేసుకుంటుంటే హోం మంత్రి, ప్రధాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ, అమిత్‌షా తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వత్తాసు పలుకుతున్నారన్నారు. గతంలో ఇంటింటికీ రేషన్ అందితే ఇప్పుడు షాపుల వద్ద ప్రజలంతా గుమిగూడి లైన్లలో నిలబడి రేషన్ కోసం అవస్థలు పడుతున్నారన్నారు. ఆదివాసీ హక్కుల కోసం సీపీఐ పోరాడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీపీఐకి అధికారమివ్వాలని పిలుపునిచ్చారు.
కోట చుట్టూ ఉన్న దుకాణదారుల బతుకులు మారాలి..
బొబ్బిలి ఎమ్మెల్యే కోటలో ఉండడం గొప్ప కాదని.. ఆ కోట చుట్టూ ఉన్న దుకాణదారుల బతుకులు మారేలా పాలన సాగించాలని హితవు పలికారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని కోరితే ఆరు నెలల్లో సమస్య పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే బేబీనాయన ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే పట్టణంలోని వెలమదొరలు వందలాది ఎకరాలు ఆక్రమిస్తుంటే వారిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బొబ్బిలి జూట్‌మిల్లు తెరిపిస్తామన్న హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టే రోజులు వచ్చాయన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలపై వస్తున్న నిరసనలను అణిచివేసే క్రమంలో సుమారు 750 మంది రైతులు మృతి చెందారన్నారు. అటవీ సంపదను అదానీ, అంబానీలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ సృష్టించి మావోలను, ఆదివాసీలను హతమార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మహాసభల సందర్భంగా జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆధ్వర్యంలో ముందుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణమంతా ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. అనంతరం తాండ్రపాపారాయ జంక్షన్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, జిల్లా నాయకుడు బుగత అశోక్, రాజాం కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠ యాదవ్, బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కండాపు ప్రసాదరావు, మహిళా సమాఖ్య నాయకులు బాయి రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
విదేశాల్లో తిరగడానికి ఉన్న శ్రద్ధ మణిపూర్ మహిళల పరామర్శకు లేదా?
మోదీ నిర్ణయాలకు చంద్రబాబు, పవన్‌ల వత్తాసు
పేదల బతుకులు మారాలి
సీపీఐ జిల్లా మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు

ఎరుపెక్కిన బొబ్బిలి..