
వంగర ఘాట్‌రోడ్డుకు గండి
గుమ్మలక్ష్మీపురం: ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని కేదారిపురం మీదుగా వంగర వెళ్లే ఘాట్‌రోడ్డు కోతకు గురికావడంతో గండి పడింది. దీంతో వంగర మీదుగా కేసర వరకు నడిపే ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను సైతం నిలిపివేశారు. ఏడాది కిందట కూడా ఇదే ప్రాంతంలో గండి పడడంతో సీసీ రోడ్డు నిర్మించి, ఓ వైపు రక్షణ గోడ నిర్మించారు. అయినప్పటికీ మళ్లీ అదే ప్రాంతంలో గండి పడడంతో వంగర, కేసర, డోలుకోన, సంధిగూడ గ్రామాల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కారుణ్య నియామకం
విజయనగరం క్రైమ్ : పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసి అనంతరం మృతి చెందిన సీహెచ్ ఈశ్వరరావు కుమారుడు సీహెచ్ తేజను జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నీతి, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, డీపీఓ సూపరింటిండెంట్ వెంకటలక్ష్మి, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పోక్సో కేసు నమోదు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని బుచ్చన్నపేట గ్రామానికి చెందిన బొంతు భాస్కరరావు అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై గణేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు నిండని ఓ బాలికను ప్రేమ పేరుతో శారీరకంగా వంచించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రుల సంరక్షణ నుంచి విజయవాడ తీసుకువెళ్లిపోయాడన్నారు. బాధితుల ఫిర్యాదు తో సదరు భాస్కరరావుపై పోక్సోతో పాటు కి డ్నాప్ కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.
గోముఖి నదిలోకి నీరు విడుదల
మక్కువ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని శంబర గ్రామ సమీపంలో ఉన్న గోముఖి రిజర్వాయర్‌లోకి వరద నీరు చేరుతుండడంతో శనివారం సుమారు వంద క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్ నుంచి గోముఖి నదిలోకి విడిచి పెట్టారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ జేఈ ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. వరదలు ఎక్కువైతే నదిలోకి మరింత నీరు విడిచిపెడతామని చెప్పారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: అరుకు – సిమిలిగూడ మధ్య గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని జీఆర్‌పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఐదు అడుగుల ఆరంగుళాల పొడవుండి తెలుపు రంగు ఫుల్‌హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. షర్ట్‌పై ముదురు ఆకుపచ్చ జర్కిన్ ధరించాడని, దానిపై కోడ్ అనే ఇంగ్లిష్ అక్షరాలున్నాయని చెప్పారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే 94906 17089, 63013 65605 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఆయనతో పాటు కానిస్టేబుల్ అశోక్ ఉన్నారు.

వంగర ఘాట్‌రోడ్డుకు గండి

వంగర ఘాట్‌రోడ్డుకు గండి