
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం..
పార్వతీపురం టౌన్: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్ అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఏపీఎన్‌జీఓ హోమ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ 32వ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టి.అఖిల్ సంఘ లక్ష్యాలతో కూడిన జెండాను ఆవిష్కరించారు. అనంతరం రామ్మోహన్, తదితరులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఈ మధ్యకాలంలో మరణించిన ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, తదితరులకు ప్లీనరీ ప్రతినిధులు సంతాపం తెలియజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు సంధ్య, బి.అనిల్, సీహెచ్ సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామ్మోహన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన విద్యా విధానం వల్ల ప్రభుత్వ విద్యా విధానం అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు గతంలో కంటే నేడు మరో రూపంలో దాడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని ఆరోపించారు. అలాగే తల్లికివందనం పథకంలో లేనిపోని షరతులు పెట్టి ఎక్కువ మంది చిరుద్యోగులను దూరం చేశారన్నారు. సంక్షేమ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నేటికే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించక పోవడం దారుణమని మండిపడ్డారు.
పలు తీర్మానాలు ఆమోదం..
పార్వతీపురం, పాలకొండ, గమ్మలక్ష్మీపురం కేంద్రాల్లో పీజీ సెంటర్లో ఏర్పాటు చేయాలని.. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని.. జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని.. గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని.. సంక్షేమ హాస్టళ్లలో రెగ్యులర్ ఏఎన్‌ఎంలను నియమించాలని చేసిన తీర్మానాలను ఆమోదించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బిడ్డిక అనిల్, కార్యదర్శిగా తిర్లంగి అఖిల్, కోశాధికారి కె.డేవిడ్, ఉపాధ్యక్షులుగా ఎ.గంగారం, సీహెచ్ సింహాచలం, సహయ కార్యదర్శులుగా సంధ్య, సూర్యతో పాటు మరో పది మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్