
చిన్నారులంటే అంత అలుసా..
● అంగన్‌వాడీ చిన్నారులకు ఇంతవరకు పంపిణీ చేయని ప్రీ స్కూల్ కిట్లు
● అందని ఆటపాటలతో కూడిన విద్య
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపిస్తే ఆటపాటలతో కూడిన విద్య అందుతుందని తల్లిదండ్రుల నమ్మకం. అయితే ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు అవసరమైన వస్తువులతో కూడిన ప్రీ స్కూల్ కిట్లను ఇంతవరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేయలేదు. చిన్నారులంటే మరీ ఇంత అలుసా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. కాని పిల్లల చదువుకు అవసరమైన స్కూల్ కిట్లను మాత్రం ఇంతవరకు సరఫరా చేయలేదు. అసలే అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య అంతంత మాత్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ కిట్లు అందివ్వకపోవడం.. ఆటపాటలతో కూడిన విద్య అందకపోతే కేంద్రాల మనుగడే ప్రశ్నార్థమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
11 ప్రాజెక్ట్‌లు..
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 11 ఉన్నాయి. వీటి పరిధిలో 2,499 అంగన్‌వాడీ కేంద్రాలుండగా..మెయిన్ కేంద్రాలు 2,206 కాగా 293 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. ఆయా కేంద్రాల పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 42,161 మంది.. మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 21,543 మంది ఉన్నారు.
సరఫరా మాటేమిటి..?
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ప్రీ స్కూల్ కిట్లు (ఆట వస్తువులతో కూడిన మెటీరియల్) అందించాలి. కార్యకర్తలు వీటతోనే చిన్నారులకు బోధన అందిస్తారు. కిట్‌లో బిల్డింగ్ బ్లాక్స్, బాల్స్, బ్యాట్, రింగ్స్, బొమ్మలు, అక్షరాలతో కూడిన కార్డులు, స్లేట్స్ ఉంటాయి. వీటిని చిన్నారులకు చూపిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో బోధన అందించాల్సి ఉంది. ఇంతటి ఉపయోగం ఉన్న కిట్లను కూటమి సర్కారు పంపిణీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా రాలేదు..
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన ప్రీ స్కూల్ కిట్లు ఇంకా రాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వచ్చిన వెంటనే కేంద్రాలకు పంపిణీ చేస్తాం.
– టి. విమలారాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్