
తల్లి సంవత్సరీకానికి వెళ్తూ కుమార్తె మృతి
భామిని: తల్లి సంవత్సరీకంలో పాల్గొనేందుకు వెళ్తూ కుమార్తె మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన కొండేటి తవిటమ్మ భర్త జనార్దనరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఒడిశాలోని గుణుపూర్‌కు బయలుదేరింది. సరిగ్గా భామిని మండలం ఘనసర వద్దకు వచ్చేసరికి తవిటమ్మ చీర ద్విచక్ర వాహనంలో చిక్కుకుపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఈ ప్రమాదంలో తవిటమ్మకు తీవ్రగాయాలు కాగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సీతంపేట ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అయితే అప్పటికే తవిటమ్మ (47) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బత్తిలి ఎస్సై జి.అప్పారావు ఆధ్వర్యంలో ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు.
ద్విచక్ర వాహనంలో చీర చిక్కుకోవడంతో ప్రమాదం