
వీడని వరద కష్టాలు
అధికారులు స్పందించాలి
ఏటా సాయన్నగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. పొలాలను వరదనీరు ముంచెత్తుతోంది. వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇది రైతుల దీర్ఘకాలిక సమస్యగా మారింది. అధికారులు స్పందించాలి. సాయన్నగెడ్డలో పూడికలు తొలగించాలి. పొలాలను ముంచెత్తుతున్న వరదనీరు కిందకు మళ్లించేందుకు మదుములు నిర్మించాలి.
– యెన్ని శ్రీనివాసరావు,
మాజీ సర్పంచ్, రామారాయపురం
సంతకవిటి: ఆ గ్రామాల పొలాలకు ఓ వైపు నారాయణపురం కుడి ప్రధాన కాలువ, మరోవైపు సాయన్నగెడ్డ ఉంది. వర్షం కురిస్తే చాలు... ఈ రెండు కాలువలకు మధ్యన ఉన్న పొలాల్లో నీరు పోటెత్తుతోంది. వరద నీరు వెళ్లే మార్గం ఉండదు. ఎగువన ఉన్న నారాయణపురం కుడి ప్రధాన కాలువ నీరు సాయన్నగెడ్డలో కలిసే అవకాశం ఉండదు. గెడ్డ కింద నుంచి పొల్లాలోని వరదనీటిని నాగావళి నదికి మళ్లించేందుకు అనువుగా ఎలాంటి మదుములు లేవు. ఫలితం.. రెండు కాలువల మధ్యన ఉన్న సంతకవిటి మండలంలోని మల్లయ్యపేట, రామారాయపురం, హొంజరాం, బూరాడపేట, మల్లయ్యపేట, మంతిన, పనసపేట, గెడ్డబూరాడపేట గ్రామాల పరిధిలోని పంట పొలాలు నీటమునుగుతున్నాయి. ఏటా రైతన్నకు పంట నష్టాన్ని మిగుల్చుతున్నాయి. పంట సాగుచేయడమే తప్ప అది ఇంటికి వస్తుందన్న నమ్మకం ఉండడం లేదు. వరద కష్టాలు తీర్చాలంటూ రైతులు గోడు వినిపిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. రైతుకు నష్టాలు తప్పడంలేదు.
ముంపునకు కారణం ఇదీ...
రేగిడి మండలం సంకిలిహెడ్‌చానల్ నుంచి సంతకవిటి మండలం వాల్తేరు వరకు సాయన్నగెడ్డ విస్తరించి ఉంది. సంకిలి హెడ్‌చానల్ వద్ద షట్టర్లు పాడవ్వడంతో నాగావళి నదికి వరద పోటెత్తినప్పుడు సాయన్నగెడ్డ ఉగ్రరూపం దాల్చుతుంది. గెడ్డ నుంచి నీరు కిందకు వెళ్లేందుకు ఎక్కడా ఎలాంటి మదుములు లేకపోవడం, గెడ్డలో పూడికలు పేరుకుపోవడంతో వరదనీరు పొలాలను ముంచెత్తుతోంది. నెలల తరబడి నీరు నిల్వ ఉండడంతో సుమారు రెండు వేల ఎకరాల్లో పంటనష్టం జరుగుతోంది. ఇది అధికారులు, పాలకులకు తెలిసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ముంపునకు గురవుతున్న రెండు గెడ్డల మధ్య పొలాలు
మదుములు లేకపోవడం,
గెడ్డల్లో పూడికలే కారణం
పట్టించుకోని అధికార యంత్రాంగం

వీడని వరద కష్టాలు