
‘మీ కోసం’ కాల్ సెంటర్ ఏర్పాటు
విజయనగరం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్‌ఎస్) అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్– 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. తమ అర్జీలు ఇప్పటివరకు పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీల నమోదుకు ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకొని సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్‌మెంటల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్‌లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని కోరారు. ఉదయం పరీక్షకు 8.30 నుంచి 9.15 గంటల మధ్య, మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.15 మధ్యన మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. సీతం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఐయాన్ డిజిటల్ సెంటర్, లెండి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. సమావేశంలో ఏపీపీఎస్‌సీ సెక్షన్ ఆఫీసర్లు పి.వి.నవజ్యోతి, ఎ.నాగలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కరరావు, డీఎస్పీ ఎం.వీరకుమార్, డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
జిందాల్ నిర్వాసితులకు సంఘీభావం
శృంగవరపుకోట: భూములు కోల్పోయి నెలరోజులుగా పోరాటాలు చేస్తున్న జిందాల్ నిర్వాసిత రైతులకు మానవహక్కుల సంఘం చైర్మన్ డాక్టర్ సంపత్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఆయన బొడ్డవరలో నిర్వాసితులతో శనివారం సమావేశమయ్యారు. జిందాల్ నిర్వాసితులు 37 రోజులుగా చేస్తున్న పోరాటాలు గమనిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై హెచ్‌ఆర్‌సీ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, రైతు సంఘం నేత చల్లా జగన్, తదితరులు పాల్గొన్నారు.

‘మీ కోసం’ కాల్ సెంటర్ ఏర్పాటు