
ఇంటర్ విద్యలో సంస్కరణలపై అవగాహన కల్పించాలి
విజయనగరం అర్బన్: ఇంటర్ విద్యలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు అవగాహన కల్పించాలని ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్.తవిటినాయుడు అన్నారు. విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ విద్య నూతన సంస్కరణలపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సిలబస్, సబ్జెక్టుల కలయిక, ప్రశ్నపత్రంలో మార్పులను వివరించారు. గ్రూపు సబ్జెక్టులతో పాటు పార్ట్–1గా ఇంగ్లిష్, పార్ట్–2లో ద్వితీయ భాషగా తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, తమిళ్, కన్నడ, ఒడియా, పర్షియన్, ఫ్రెంచ్ లేదా ప్రధాన సబ్జెక్టులైన గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ లేదా మైనర్ సబ్జెక్టులైన జాగ్రఫీ, లాజిక్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఎంపీసీ విద్యార్థులు అడిషనల్‌గా ఆరవ సబ్జెక్టు ఆప్షన్‌గా బయాలజీ, బైపీసీ విద్యార్థులు అడిషనల్ సబ్జెక్టుగా గణితంను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. గణితం–ఏ,బీలను విలీనం చేసి ఒక సబ్జెక్టుగా, బోటనీ, బయా లజీ సబ్జెక్టులను విలీనం చేసి బయాలజీ సబ్జెక్టుగా ఈ ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు అమలు చేస్తారన్నారు. ద్వితీయ సంవత్సరంలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.
ఆర్‌ఐఓ ఎస్.తవిటినాయుడు

ఇంటర్ విద్యలో సంస్కరణలపై అవగాహన కల్పించాలి