
2027 డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి
విజయనగరం అర్బన్: రీ సర్వే ప్రక్రియను రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని రెవెన్యూ జిల్లా ప్రత్యేక అధికారి, ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ అదనపు సంచాలకుడు ఆర్.గోవిందరావు తెలిపారు. జిల్లాలో ఆయన క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రీ సర్వే, రెవెన్యూ అంశాలపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఇళ్ల స్థలాలు రీ వెరిఫికేషన్, రెగ్యులరైజేషన్, పీజీఆర్‌ఎస్, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, కులాల వెరిఫికేషన్ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తిచేయాలన్నారు. ఆగస్టు 5వ తేదీనాటికి గ్రామ సరిహద్దులు గుర్తింపు, సెప్టెంబర్ 15 నాటికి రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, నవంబర్ ఐదు నాటికి ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియలు పూర్తి చేయాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం అందజేసేందుకు వెరిఫికేషన్ పూర్తిచేసి నివేదిక అందజేయాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రీ సర్వే వివరాలను తెలియజేశారు. పీజీఆర్‌ఎస్ అర్జీలకు సంబంధించి ఐదు ప్రశ్నలతో అర్జీదారుల నుంచి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారులు దాట్ల కీర్తి, మోహనరావు, ఆశయ్య, సర్వే శాఖ సహాయ సంచాలకులు రమణమూర్తి, కలెక్టరేట్ ఏఓ గోవింద్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ జిల్లా ప్రత్యేక అధికారి
గోవిందరావు