
డయేరియా బాధితులకు తక్షణ వైద్యం
విజయనగరం ఫోర్ట్: డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించాలని, ఐదేళ్లలోపు వయస్సుగల పిల్లల్లో డయేరియా మరణాలు సంభఽవించకుండా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వైద్యారోగ్యశాఖాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 1 నుంచి జూలై 31 వరకు జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామాల్లో తాగునీటిని క్లోరినేషన్ చేయాలని, నీటి ట్యాంక్‌లను పరిశుభ్రం చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వేడివేడి ఆహారాన్ని, పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. అనంతరం డయేరియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ ఎన్.పి.పద్మశ్రీరాణి, డీఈఓ రెడ్డి అచ్చుతకుమారి, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్, రాజాం మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.