
గుర్రుమీదున్న గురువులు
● ఐఆర్, పీఆర్సీ పెండింగ్ డీఏలపై
నోరుమెదపని సర్కారు
● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ గాలికి
● సమస్యలపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు
● నేడు కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్
ఆధ్వర్యంలో ధర్నా
రామభద్రపురం: చంద్రబాబుతో జతకట్టిన పవన్ కల్యాణ్ సైతం సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలకు హామీల వర్షం కురిపించారు.ఆ వర్షంలో తడిసి ముద్దయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులూ ఉన్నారు. మాకు అధికారం ఇచ్చి చూడండి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం. పెండింగ్ బకాయిలన్నింటినీ ఒకేసారి చెల్లిస్తాం, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను అందించే ఏర్పాట్లు చేస్తాం. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల కోసం రాజకీయ నాయకుల చట్టూ తిరిగే పని లేకుండా చేస్తాం. ఉద్యోగుల పని భారం తగ్గిస్తాం అంటూ ఇలా ఎన్నో అలవిగాని హామీలతో చంద్రబాబు ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు.అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకూ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కూటమి సర్కారుపై కోపంగా ఉన్నారు. తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చకపోతే ఉద్యమాలకు సిద్ధం అంటూ కూటమి సర్కారుకు హెచ్చరికలు జారీచేస్తున్నారు.
ఇంకెన్నాళ్లు ఎదురు చూపు..
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగిన ప్రతిసారి తమ సమస్యలపై ఏమైనా చర్చిస్తారేమోనని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏడాదిగా ఎంతో ఆశతో ఎదురుచూస్తూ వస్తున్నారు.ఈ 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా కనీసం ఆ ఊసేఎత్తలేదు. ఇప్పటికే ఉద్యోగులకు మూడు డీఏలు పెంగింగ్‌లో ఉండగా జూలైతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది.అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదీ లేదు. పీఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఇప్పటి వరకూ కొత్త కమిషన్‌ను నియమించలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ఓపీఎస్‌పై నోరుమెదపని సర్కారు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ను తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను తీసుకొస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు మాటిచ్చారు. ఏడాది కాలంలో ఏనాడూ ఈ అంశంపై నోరు మెదపలేదు. ఈ విషయంలోనూ కూటమి సర్కారు ఉద్యోగులకు వెన్నుపోటు పొడించింది. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ మంజూరు చేసిన విషయాన్ని పలు ఉద్యోగ సంఘాల నాయుకులు గుర్తుచేసుకుంటున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
లేనట్లేనా?
తాము అధికారంలోకి రాగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మాటలు చెప్పేవాళ్లం కాదు. చేసి చూపిం చేవారిమని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని అంచనా. వారిలో 15 ఏళ్లకు పైబడి విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా ఉన్నారు.అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలో ఏనాడూ కూటమి ప్రభుత్వం వారికిచ్చిన హామీపై చర్చించిన దాఖలాలు లేవు. దీనికి భిన్నంగా జనవరి 6న జీవో నంబర్–2 ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ప్రభుత్వ పథకాల్లో ఉండే ఉద్యోగులకు కూడా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వడం జరగదని నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆయా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీరు కూడా ఆందోళన బాట పట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
ఉద్యమ బాట తప్పదు..
ఏటా జనవరి, జూలై మాసాల్లో ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటిస్తోంది. దానిని అనుసరించి రాష్ట్రం డీఏలు ఇవ్వాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఈ జూలై మాసంతో పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు వెంటనే ఇవ్వకపోతే ఉద్యమబాట పట్టాల్సి వస్తుంది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై ఽశనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నాం.
ప్రసన్నకుమార్,
యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు

గుర్రుమీదున్న గురువులు

గుర్రుమీదున్న గురువులు