
గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం
బొబ్బిలి: నియోజకవర్గంలోని రామభద్రపురం మండలం కాకర్ల వలస, కారేడువలస గ్రామాల గిరిజనుల సాగు భూములు లాక్కుని ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తే సహించబోమని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరుఅఉ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్కు బాధితులకు మద్దతుగా ఉంటామన్నారు. కారేడు వలస, కాకర్ల వలస గ్రామాల్లో నివాసముంటున్న గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేస్తున్నారని ఆ భూముల ఆధారంగా జీవనం పొందుతున్న గిరిజనుల నుంచి ప్రభుత్వం అన్యాయంగా భూమిని లాక్కోవడం సరికాదన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా భూమిని లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. గిరిజనులు వేసుకున్న మామిడి, జీడి మొక్కలను, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయడం పద్ధతేనా అని ప్రశ్నించా రు. ఏళ్ల తరబడి జీవనోపాధి పొందుతున్న భూమికి పరిహారం ఇవ్వకుండా ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఖాళీగా ఉన్న భూముల జోలికి వెళ్లకుండా వాటి పక్కనే ఉన్న గిరిజనులకు చెందిన భూములను తీసుకుంటామనడం ఎంత వరకూ సబబని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు.
ధ్వంసం చేసిన పంటకు పరిహారం ఇవ్వాలి
గిరిజనుల భూములను వెంటనే వారికి వదిలేసి, ధ్వంసం చేసిన పంటలకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూములను తీసుకుని వాటికి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూములు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ జేవీఎస్‌ఎస్ రామమోహన రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మిర్తి వలస సర్పంచ్ మజ్జి రాంబాబు, సీపీఎం రామభద్రపురం మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, గిరిజనులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా

గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం