
కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించాలి
విజయనగరం క్రైమ్: కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించాలని, అలాగే స్కూల్స్, కాలేజీల్లో శక్తి వారియర్ టీమ్స్ ను నియమించాలని డీఎస్పీలతో పాటు అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్స్‌ను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అడ్మిన్ ఏఎస్పీ సౌమ్యలతతో కలిసి పోలీస్ అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. శక్తి టీమ్స్ పనితీరు, రిపీటెడ్ నిందితులు, మహిళల అదృశ్యం, గంజాయి కేసులు, ఫైనాన్షియల్ దర్యాప్తు, నాన్ బెయిలబుల్ వారంట్ల ఎగ్జిక్యూషన్‌ను సమీక్షించారు.అలాగే పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, సాంకేతికత వినియోగం గురించి దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే హిస్టరీ షీట్లు కలిగిన నిందితులపై గత కేసుల ప్రస్తుత స్థితి, కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు.
కేసుల మిస్టరీని ఛేదించాలి
ఇక నాన్ బెయిలబుల్ వారంట్లు, పోయిన వాహనాలు, మిస్సింగ్ వ్యక్తులను గుర్తించేందుకు, సైబర్ క్రైం, గంజాయి కేసుల్లో లభించిన చిన్న చిన్న ఆధారాలతో సాంకేతికతను వినియోగించి కేసుల మిస్టరీని చేధించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఏడేళ్లకు పైబడి శిక్షలు విధించిన అన్ని కేసుల్లో రికార్డు చేసిన వీడియోలు, ఫొటోలను ఈ సాక్ష్య యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఈ సాక్ష్య యాప్‌ను ప్రతి దర్యాప్తు అధికారి వినియోగించాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చెయ్యాలని, పరారీలో ఉన్న ఎన్బీడబ్ల్యు వ్యక్తులకు ష్యూరిటీగా నిలిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
శివారు ప్రాంతాలపై నిఘా
అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉన్న పాత బిల్డింగులు, శివారు ప్రాంతాలను గుర్తించి నిఘా పెట్టాలని ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, సంబంధిత లయన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులతో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జూమ్ మీటింగులో డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి.భవ్యారెడ్డి, ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, పలువురు సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ అధికారలతో ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్