
ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ...
రామభద్రపురం:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తయింది. ఇప్పటివరకు ఏ సంక్షేమ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసిన దాఖాలా లేవు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చిన కూటమి నేతలు ఇప్పుడు పథకాల అమలులో చేతులెత్తేస్తున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, అన్నదాతసుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాలు అటకెక్కగా.. భర్తలు కోల్పోయిన మహిళలను ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. పింఛన్ ఇస్తామని ఊరిస్తూ ఉసూరుమనిపిస్తోంది. దరఖాస్తు చేసి నెలలతరబడి ఎదురుచూస్తున్నా పింఛన్ డబ్బులు చేతికందని పరిస్థితి. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య సామాజిక పింఛన్‌దారు మరణిస్తే వారి భార్యలకు స్పౌజ్ కేటగిరీలో పింఛన్ మంజూరుకు అర్హులుగా నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా 3,419 మందికి స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు మంజూరు చేశారు. వీరికి జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్లు అందజేస్తామని ప్రకటించారు. అయితే, అనివార్యకాారణాలతో పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జూలై 1న పంపిణీ చేయాలని రూ.1,36,76,000 నిధులు విడుదలచేసినా లబ్ధిదారుల చేతికి అందలేదు. తిరగి ఆ నిధులను ప్రభుత్వం వెనుకకు తీసుకోవడంతో నిరాశ తప్పలేదు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అర్హత మేరకు ప్రతి ఆరునెలలకోసారి కొత్తపింఛన్లు మంజూరయ్యేవని, పింఛన్ డబ్బులు ఠంచన్‌గా అందేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతీ పథకం అమలులోనూ కుతంత్రమే కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పింఛన్ డబ్బుల కోసం వితంతువుల ఎదురుచూపు
జిల్లా వ్యాప్తంగా 3,419 మందికి మంజూరైన స్పౌజ్ పింఛన్లు
జూలై నెలలో అందని డబ్బులు వచ్చేనెలా అందుతాయోలేదోనన్న బెంగ
కూలికి వెళ్తున్నా..
భర్త మంగయ్య ఏడాదిన్నర కిందట చనిపోయాడు. పిల్లలు లేరు. ఒంటరిదాన్ని అయ్యాను. పింఛన్ ఇస్తామని చెబుతున్నారే తప్ప ఇవ్వడం లేదు. ఆకలి తీర్చుకునేందుకు కూలికి వెళ్తున్నా. పింఛన్ వస్తే కాస్త ఆర్థిక భరోసా కలుగుతుంది.
– పొగందర తవిటమ్మ, కొండకెంగువ
త్వరలోనే పంపిణీ చేస్తాం..
స్పౌజ్ పింఛన్ల లబ్ధిదారులకు జూలై నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అనివార్య కారణాలతో మళ్లీ డేట్ ఇస్తామని పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఉన్నతాధికారుల ఆదేశానుశారం త్వరలోనే స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేస్తాం.
– సీహెచ్ రత్నం, ఎంపీడీఓ, రామభద్రపురం

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ...