
30 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్ట్
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఎంఆర్ లాడ్జి ఎదురుగా ముగ్గురు వ్యక్తులు 30 కిలోల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు వన్ టౌన్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 22న వన్ టౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో రైల్వేస్టేషన్ రోడ్డులో మాటు వేసి ఉండగా, ముగ్గురు వ్యక్తులు రెండు ట్రాలీ సూట్ కేసులను తోసుకుంటూ ఎంఆర్ లాడ్జి ఎదురుగా వచ్చేసరికి, అనుమానంతో వన్ టౌన్ పోలీసులు సోదా చేశారన్నారు. ఒక ట్రాలీ సూట్ కేసులో 13కిలోలు, మరో సూట్ కేసులో 17కిలోల గంజాయి, నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లు, రెండు కీ ప్యాడ్ ఫోన్లు, రూ.4000 నగదు లభించినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితులను (ఎ1) ఒడిశాలోని కలహండి జిల్లా ఉచ్చలకు చెందిన పితాంబర్ నాగ్ (42) (ఎ2) కలహండి జిల్లా బిరుమలకు చెందిన చంద్ర కరుణ్ (35) (ఎ3) చార్‌బహల్‌కు చెందిన ప్రదీప్ నాయక్ (40)లుగా గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నామని తెలిపారు.