
అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు
● జిల్లాలో 2499 కేంద్రాలు
● వాటిలో మినీ కేంద్రాలు 293
● ఏడాదికి అద్దె రూపేణా రూ.6 కోట్ల చెల్లింపు
త్వరగా పూర్తయ్యేలా చర్యలు
అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత సీడీపీఓలను కూడా పర్యవేక్షించాలని చెప్పాం. త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.
– టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రం భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. భవనాలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా వాటి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల అంగన్‌వాడీలకు సొంత గూడు కరువవుతోంది. దీంతో అద్దె భవనాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించాల్సిన పరిస్థితి. వివిధ పథకాల కింద జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరైనప్పటికీ వాటి నిర్మాణం పూర్తి చేయడంలో అలసత్వం కారణంగా అంగన్‌వాడీలకు తిప్పలు తప్పడం లేదు. వసతులు లేక, ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నిర్వహించాల్సిన దుస్థితి. దీనివల్ల కేంద్రాల్లో చదివే పిల్లలు అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో 2499 కేంద్రాలు
జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో 2206 మెయిన్ కేంద్రాలు , 293 మినీ కేంద్రాలు. వాటిలో సొంత భవనాల్లో నడుస్తున్న కేంద్రాలు 792 ఉన్నాయి. అద్దె రహిత భవనాల్లో 494 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో 1213 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అద్దె కేంద్రాలు కూడా ఇరుకుగా ఉండడంతో పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందడం లేదు.
ఏడాదికి రూ.6 కోట్ల అద్దె చెల్లింపు
జిల్లాలోని అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు ఏడాదికి కోట్లాది రుపాయలు అద్దె చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె రూ.2 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 6 వేల వరకు చెల్లిస్తున్నారు ఏడాదికి వాటికి సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు అవుతోంది. సొంత భవనాలు మంజూరైనప్పటికీ అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
వివిధ పథకాల కింద 919 కేంద్రాలకు భవనాలు
జిల్లాలో వివిధ పథకాల కింద 919 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరయ్యాయి. వాటిలో 364 భవనాల నిర్మాణం పూర్తయింది. 262 భవనాలకు ఇంకా పునాది రాయి పడలేదు. 288 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఉపాధి హామీపథకం –1, 2 కింద భవనాల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.7.50 లక్షలు, ఆర్‌డీఎఫ్ కింద ఒక్కో భవనానికి రూ.12 లక్షలు, ఆర్‌ఐడీఎఫ్–23 పథకం కింద ఒక్కో భవనానికి రూ.11.20 లక్షలు, ఆర్‌ఐడీఎఫ్–24 కింద ఒక్కో భవనానికి రూ.12 లక్షలు ఎంబీఎంబీ పథకం కింద ఒక్కో భవనానికి రూ. 16 లక్షలు చొప్పన మంజూరయ్యాయి.

అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు