
వీఆర్‌ఏల వేతన యాతన
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా తమ వేతనాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సి ఉన్నా ఇప్పటి దాకా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామస్థాయిలో అది విజయవంతం కావాలంటే దానికి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ)లే కీలకంగా ఉంటారు. కలెక్టర్ నుంచి గ్రామ స్ధాయి వీఆర్వో వరకు ఏ పని జరగాలన్నా దానికి కావాల్సింది వీఆర్‌ఏలే. రాత్రీపగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలు వేస్తే మారు మాట్లాడకుండా ఎంత దూరాభారమైనా వెళ్లి రావాల్సిందే తప్ప..ఇదేంటి అని అడిగే అధికారం ఉండదని వీఆర్‌ఏలు అంటున్నారు. టైం జాబ్‌గా ప్రారంభమై ఇప్పుడు సమయమే లేని ఉద్యోగంగా తయారైంది. ఎప్పుడు పిలిచినా రావాలి. ఏం చెప్పినా చేయాలనే చందాన అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. రోజుకు రూ.370 భత్యంతో నెలకు రూ.10,000 నుంచి రూ.11,085 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.పేస్కేల్ అమలు చేసి ప్రతి నెలా రూ.18,000 జీతం ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
సిబ్బంది తక్కువ పని ఎక్కువ..
పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో వీఆర్‌ఏల కొరత తీవ్రంగా ఉంది. మండలానికి కనీసం 45 మంది వీఆర్‌ఏలు ఉండాల్సి ఉండగా కేవలం 20 నుంచి 35 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 415 మంది వీఆర్‌ఏలు ఉండగా సుమారు 100 రెవెన్యూ గ్రామాల్లో వీఆర్‌ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రీ–సర్వే, రేషన్ కార్డుల సర్వే, రెవెన్యూ కార్యక్రమాలు ఇతర ఏరకమైన పనులు ఉన్నా వారితోనే చేయించడంతో తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. తమ పని తాము చేసుకోవడమే చాలా కష్టంగా ఉందని ఇప్పడు రీ–సర్వే పేరుతో ఇతర గ్రామాలకు కూడా పంపించి పని చేయిస్తున్నారని దానివల్ల మాకు కనీస ప్రతిఫలం లేదని వాపోతున్నారు.
మంత్రి లోకేష్‌కు వినతి పత్రం ఇచ్చినా..
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు వీఆర్‌ఏలకు న్యాయం చేస్తామని ఆనాటి కూటమి నాయకుల వాగ్దానాలు నమ్మి మోసపోయామని వీఆర్‌ఏలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీతాలు పెంచాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఆర్‌ఏల సంఘం నాయకులు మంత్రి నారా లోకేష్‌ను ఒకసారి కలిసి తమ సమస్యలు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు.
ప్రమోషన్‌లు ఇవ్వాలి
కూటమి ప్రభుత్వంలో మాకు తగిన గుర్తింపు ఇవ్వాలి. వీఆర్‌ఏలుగా ఎన్నో ఏళ్ల సీనియారిటీ కలిగిన వారిని గుర్తించి ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలి. డీఏలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. చాలీచాలని జీతంతో కుటుంబం గడవాలంటే కష్టంగా ఉంది. ఇప్పటికై నా మా జీతాలు పెంచాలి. – జి.జగన్, వీఆర్‌ఏ, కంబర
కూటమి వచ్చి ఏడాదైనా జీతాలు
పెంచలేదని ఆవేదన