
పిడుగుపాటుతో రైతు మృతి
రేగిడి: రేగిడి మండల పరిధిలోని జాడపేట గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన రైతు అల్లబోయిన శ్రీను (50) మృతిచెందాడు. తన పొలంలో తోటి రైతులతో కలిసి నారు తీస్తున్న సమయంలో ఆయన భార్య నీలవేణి పనులు చేస్తున్న రైతులకు భోజనాలు తీసుకువెళ్లింది. నారు తీసిన అల్లబోయిన శ్రీనుతోపాటు మిగిలిన రైతులు భోజనాలు చేసుకునేందుకు చేతులు శుభ్రం చేసుకుంటున్న సమయంలోనే పిడుగుపడింది. దీంతో సంఘటనా స్థలంలోనే శ్రీను మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. పక్కనే ఉన్న రైతులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పరిసరాల్లోని రైతులు ఘటనా స్థలానికి వచ్చి అస్వస్థతకు గురైనవారికి సపర్యలు చేశారు. మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.నీలావతి విలేకరులకు తెలిపారు.
మరో గ్రామంలో ఆవు..
గుర్ల: మండలంలోని కోటగండ్రేడులో బుధవారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో పాటు పాటు పిడుగులు పడడంతో అదే గ్రామానికి చెందిన ముద్దాడ అప్పలనాయుడి ఆవు మృతి చెందింది. పశువుల శాల పక్కన చెట్టు వద్ద ఉన్న ఆవుపై పిడుగు పడి మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు.

పిడుగుపాటుతో రైతు మృతి