
ప్రాక్టికల్ శిక్షణకు పదిమంది ఎస్సైలు
పార్వతీపురం రూరల్: ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సివిల్ ఎస్సైలను ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లాకు పది మందిని కేటాయించినట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న 49 మంది ఎస్సైలు ఐదు నెలల ప్రాక్టికల్ శిక్షణకు వెళ్లేముందు బుధవారం విశాఖలో డీఐజీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఐజీ వారితో మాట్లాడుతూ పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, సేవా తత్పరత అత్యంత ముఖ్యమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం సాధన, పోలీసులు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో విధులు, రికార్డులు, స్థానిక చట్టాలు, భౌగోళిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సహచర ఉద్యోగులు, ప్రజలతో విశ్వాసపూర్వక సంబంధాలు ఏర్పరిచినప్పుడు సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడితో పాటు ఏఎస్‌ఆర్, విజయనగరం జిల్లాల ఎస్పీలు మరికొందరు అధికారులు, ప్రొబేషనరీ ఎస్సైలు పాల్గొన్నారు.

ప్రాక్టికల్ శిక్షణకు పదిమంది ఎస్సైలు