
మా భూములు మాకివ్వండి
శృంగవరపుకోట: జిందాల్ కర్మాగారం అన్యాయం చేసిన రైతులను ఆదుకోవాలని కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ ఇ.మురళిని జిందాల్ నిర్వాసిత రైతులు కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వాసితుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. దీంతో జిందాల్ నిర్వాసితులు ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్ మురళిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు కంపెనీ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగాలిస్తాం. ఉపాధి కల్పిస్తాం. పరిహారం ఇస్తాం. షేర్లు ఇస్తాం. కంపెనీలో వాటాలు ఇస్తామని నమ్మబలికి భూములు కాజేశారన్నారు. 18యేళ్లయినా కంపెనీ ఏర్పాటు చేయనందున మా భూములు మాకు ఇవ్వండని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా మిషన్లు తెచ్చి, చెట్లు కూల్చేసి, పంటలు తీసేసి దౌర్జన్యంతో ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జిందాల్‌కు కాపలా కాస్తూ, మాపై కేసులు పెడుతున్నారని వాపోయారు. మా భూములు మాకు ఇచ్చి న్యాయం చేయండి అంటూ డిప్యూటీ కలెక్టర్ మురళికి వినతిపత్రం అందజేశారు.
జిందాల్ నిర్వాసిత రైతుల డిమాండ్