
పలు సమస్యలపై జేసీకీ ఎస్‌ఎఫ్‌ఐ వినతి
విజయనగరం గంటస్తంభం: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సీహెచ్ వెంకటేష్ లు మాట్లాడుతూ జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టల్స్‌లో పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ప్రధానంగా పూసపాటి రేగ మండలంలో బీసీ కాలేజ్ హాస్టల్‌లో ఇప్పటికీ తాగునీరు సదుపాయం లేదని, అక్కడ ఉన్న విద్యార్థులు తాగడానికి మురుగునీరే శరణ్యమైందని విమర్శించారు. గతంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆమరణ నిరాహారదీక్షలు చేసినప్పుడు సాక్షాత్తు కలెక్టర్ ఆ హాస్టల్ కు ఆర్వో ప్లాంట్ హామీ ఇచ్చారని నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. తక్షణమే పూసపాటి రేగ మండల కేంద్రంలో ఉన్న బీసీ కాలేజ్ హాస్టల్‌కు ఆర్వో వాటర్ ప్లాంట్ సదుపాయం కల్పించాలని కోరారు. భోగాపురం మండలంలో శిథిలావస్థలో బీసీ చిన్నపిల్లల హాస్టల్ ఉందని అది శిథిలావస్థకు చేరుకుని మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు పక్కా భవనం నిర్మాణం చేయలేదన్నారు. దాని కారణంగా 100కు పైగా ఉండే విద్యార్థులు ఇప్పుడు 20కు పడిపోయారన్నారు. తక్షణమే జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఆ హాస్టల్ నిర్మాణానికి నిధులు విడుదల చేసి నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క బీసీ అమ్మాయిల కాలేజ్ హాస్టల్ ఉందని ఆ హాస్టల్ నందు దాదాపు 260 మంది విద్యార్థులు వసతి పొందడం ప్రభుత్వం దౌర్భాగ్య పరిస్థితిని చూపెడుతోందని విమర్శించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో బీసీ అమ్మాయిల కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఒ.రవికుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.రమేష్, కె.రాజు పాల్గొన్నారు.