ఈ చిత్రంలోని మహిళలది
డెంకాడ మండలం అక్కివరం. తమ పిల్లలు అక్కివరంలోని మోడల్ స్కూల్‌లో చదువుతున్నారు. 300లకు మించి విద్యుత్ వినియోగించారని, కుటుంబంలో ఉద్యోగులు ఉన్నారని, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారని, అధిక విస్తీర్ణంలో భూమి కలిగి ఉన్నారని... ఇలా వివిధ కారణాలు చూపి తల్లికివందనం పథకాన్ని నిలిపివేశారు. అవి సరికాదని, తాము పథకానికి అర్హులమంటూ అధికారులతో ధ్రువీకరించిన పత్రాలు సమర్పించడంతో వారి పిల్లల పేర్లు అర్హుల జాబితాలో చేరాయి. అయినా, వారి ఖాతాలకు తల్లికి వందనం పథకం డబ్బులు జమకాలేదు. దీనిపై అర్జీ అందజేసేందుకు అదే స్కూల్‌లో పిల్లలను చదివిస్తున్న 20 మంది తల్లులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ అంబేడ్కర్‌కు తమ గోడును వినిపించారు. పథకం వర్తింపజేసేలా చూడండి బాబూ అంటూ విన్నవించారు.
విజయనగరం అర్బన్:
కూటమి ప్రభుత్వం ‘అమ్మఒడి’కి ప్రత్యామ్నాయంగా అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షలామారింది. మంజూరైన జాబితాలో పేర్లు ఉన్నా నిధులు మాత్రం తల్లుల ఖాతాలకు జమకాలేదు. వివిధ కొర్రీలతో పేదలకు పథకం దూరమవుతోంది. అధికారులు, కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలలో తల్లికి వందనం పథకం అందలేదన్న అంశపై వచ్చినవే 120 ఉండడం గమనార్హం. కొన్ని పాఠశాలల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు పథకం వర్తించలేదు. వారి తల్లిదండ్రులందరూ వచ్చి కలెక్టర్‌కు సమస్యలను వివరించారు. రాజాం పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన 30 మంది పిల్లల తల్లిదండ్రులు అర్హత ఉన్నా తల్లికి వందనం పథకం అందలేదంటూ కలెక్టర్‌కు గోడు వినిపించారు.
ఇదెక్కడి అన్యాయం...
నాలుగేళ్లపాటు గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం అందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన పిల్లలందరికీ పథకం వర్తింపజేస్తామంటూ గతేడాది ఎగ్గొట్టింది. ఈ ఏడాది అర్హులకు కూడా పథకం వర్తింపజేయలేదు. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడంలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ వద్ద గగ్గోలు పెట్టారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగట్టారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలే తప్ప ఇలా ఆవేదనకు గురిచేయడం తగదన్నారు. డబ్బులు పడినట్టు మెసేజ్‌లు పంపిస్తున్నారని, తీరా బ్యాంకుకు వెళ్లి ఖాతా చెక్‌చేస్తే డబ్బులు మాత్రం జమకావడంలేదని, ఇదెక్కడి అన్యాయమంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తొలి, రెండు, మూడో విడత అంటూ కాలయాపనే తప్ప పథకాన్ని చిత్తశుద్ధితో అమలుచేసేందుకు ప్రభుత్వం చొరవచూపడంలేదని విమర్శించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్‌లో తమ అర్జీలను నమోదుచేయించినా పథకం వచ్చేవరకు గ్యారంటీ లేదవంటూ వాపోయారు.
కలెక్టరేట్‌లో 120 మంది తల్లుల
అధికారులకు వినతి
‘తల్లికి వందనం’... అందలేదు బాబూ..!