
నానో ఎరువులను డ్రోన్‌లతో పిచికారీ చేయాలి
విజయనగరం ఫోర్ట్: రైతులకు ప్రయోజనం కల్పించేలా నానో ఎరువుల పిచికారీకి డ్రోన్‌లు వినియోగించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను సోమవారం ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో వ్యవసాయ శాఖ రూపొందించిన చీడపురుగుల నుంచి పంటలను కాపాడుకునేందుకు దోహదపడే జీవన ఎరువుల ఆవశ్యకతను నానో ఎరువుల ప్రచార పోస్టర్, బ్రోచర్లను విడుదల చేశారు. నానో ఎరువుల వినియోగం, ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాకు మంజూరైన 17 వ్యవసాయ డ్రోన్‌లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.
తప్పని డోలీ కష్టాలు
మెంటాడ: గిరిజనులను డోలీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు సరైన దారిలేక పోవడంతో అత్యవసర వేళ రోగులను డోలీలోనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. మెంటాడ మండలం పిట్టాడ పంచాయతీ మిర్తివలస గ్రామానికి చెందిన సారా అప్పారావుకు గతంలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగిపోయింది. శస్త్ర చికిత్సలో భాగంగా కాలిలో ప్లేట్‌లు అమర్చారు. ఇంటిదగ్గర సరైన సదుపాయాలు లేకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కాలు వాచిపోయింది. దీంతో గ్రామస్తులు ఆయనను డోలీపై నాలుగు కిలోమీటర్ల రాళ్లదారిలో పిట్టాడ మధర గ్రామమైన వాణిజ వరకు తరలించారు. అక్కడి నుంచి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి సూక్ష్మరుణ ప్రణాళికలు
● డీఆర్‌డీఏ పీడీ
కె.సావిత్రి
విజయనగరం టౌన్: పొదుపు సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి సెర్ప్ ద్వారా సూక్ష్మరుణ ప్రణాళిక (మైక్రో క్రెడిట్ ప్లాన్), ఏసీఎల్‌పీ (యూన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్‌లీ హుడ్ ప్లాన్) పథకాలు అమలుచేస్తున్నట్టు డీఆర్‌డీఏ, వెలుగు పథక సంచాలకులు కె.సావిత్రి తెలిపారు. పథకాల అమలు తీరును కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరించారు. రుణాల వల్ల పొదుపు సంఘాల సభ్యులకు కలగనున్న ప్రయోజనాలను తెలియజేశారు. అర్హులైన సభ్యులకు రుణాలు మంజూరయ్యేలా అధికారులు సహకరించాలని కోరారు.

నానో ఎరువులను డ్రోన్‌లతో పిచికారీ చేయాలి

నానో ఎరువులను డ్రోన్‌లతో పిచికారీ చేయాలి