
రాజన్న బతికుంటే రైతులకీ పాట్లు ఉండేవా?
శృంగవరపుకోట: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బతికిఉంటే జిందాల్ నిర్వాసిత రైతులకు ఈ పాట్లు ఉండేవి కాదని ఎమ్మెల్సీ రఘురాజు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిందాల్ నిర్వాసితుల అగచాట్లు, ప్రభుత్వం వైఖరి, పోలీసుల తీరు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కూటమి సర్కారా? లేక జిందాల్ యాజమాన్యమా? అన్న సందేహం కలుగుతోందన్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని జిందాల్ భూములకు కాపలా కాయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా? లేక కార్పొరేట్ల సేవలో యంత్రాంగం తరిస్తోందా? అని ప్రశ్నించారు. జిందాల్ భూముల వద్దకు రైతులు వెళ్లకుండా, నిర్వాసితులు రోడ్డు ఎక్కకుండా కాపలా కాయడం, కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం వేతనాలు ఇస్తోందా? లేక జిందాల్ దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జిందాల్‌కు భూములు కేటాయించారని, నేడు వైఎస్‌ఆర్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. నిర్వాసితులకు జిందాల్ అన్నీ ఇచ్చేసిందని మంత్రులు, కలెక్టర్ అంతా జిందాల్ ఇచ్చిన నోట్‌నే పదే పదే చదువుతారు తప్ప ఎస్‌కోట వచ్చి ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టరు? ధైర్యంగా రైతుల ముందుకు ఎందుకురారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి స్పందిస్తారని ఆశించినా ఆమె ఏ ఒత్తిళ్ల వల్ల మాట్లాడడం లేదో తెలియడం లేదన్నారు.