
పాపం..పసివాడు
● గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారి
● ఆదుకోని ఆరోగ్యశ్రీ
● వైద్యం కోసం డబ్బు లేక తల్లిదండ్రుల విలవిల
● ఆపన్నహస్తం కోసం ఆత్రంగా
ఎదురుచూపులు
రేగిడి: ముక్కుపచ్చలారని పసికందు. బోసినవ్వులతో అమ్మ ఒడిలో లాలన..ఆలనతో గడిచిపోవలసిన పసిప్రాణం. బాల్యంలోనే మాయదారి రోగం ఆవహించింది. నిరుపేద కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూలిపనులు చేస్తే తప్ప పూటగడవని పరిస్థితి. మరోపక్క బాలుడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణభయం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంపశయ్యపై ఆ బాలుడు కాలం వెళ్లదీస్తుంటే..ఆర్థిక స్థోమత లేక నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు విలవిలలాడిపోతు న్నారు. ఇటువంటి తరుణంలో ఆ పసికందు ప్రాణం నిలబెట్టాలంటే మనసున్న వారంతా ఆపన్నహస్తం అందించాలి. వైద్యం ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రులు ప్రాథేయ పడుతున్నారు. ఇది విజయనగరం జిల్లా రేగిడి మండలం వన్నలి గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు బోనెల నిషాంత్ తల్లిదండ్రులు బోనెల రాము, అరుణలతల దీనగాథ.
గ్రామానికి చెందిన బోనెల రాము, అరుణలతకు నాలుగు నెలల క్రితం నిషాంత్ జన్మించాడు. పుట్టిన కొద్దిరోజుల వరకు ఆరోగ్యంగా ఉండేవాడు. క్రమేణా పసికందు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో తల్లిదండ్రులు తెలుసుకుని ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. వైద్యులు తనిఖీల అనంతరం బాలుడికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఆపరేషన్ చేయాలంటే రూ.6లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. సహజంగా ప్రతి మనిషికి గుండె ఎడమ భాగంలో ఉంటుంది. కానీ ఈ బాలుడికి గుండె కుడివైపు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రాజాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని ఆస్పత్రులకు పసివాడిని తిప్పారు. ఇంట్లో ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పులు చేసి పిల్లాడిని ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. ఇన్ని లక్షలు పెట్టి బాలుడికి వైద్యం చేయలేని పరిస్థితిలో తాము ఉన్నామని రోదిస్తున్నారు.
ఆదుకోని ఆరోగ్య శ్రీ..
ఆరోగ్యశ్రీ పథకం ఆ పసింకందును ఆదుకోవడం లేదు. ఎన్టీఆర్ భరోసా ద్వారా తమ కుమారుడిని రక్షించాలని పలుమార్లు వేడుకున్నప్పటికీ ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి ఆరోగ్య శ్రీ వర్తించదని చెబుతున్నారన్నారు. దీంతో ఏమీ చేయలేని ఆ కుటుంబం పిల్లవాడిని చేతిలో ఉంచుకుని బేలచూపులు చూస్తోంది.
మానవతా వాదుల కోసం..
నిరుపేద తల్లిదండ్రులు దాతల నుంచి సహాయం కోరుతున్నారు. నిషాంత్ వైద్యం కోసం సహాయం అందించాలనుకునే మానవతా వాదులు ఫోన్ ఫే నం.7036780839కు ఆర్థికసహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పాపం..పసివాడు