
వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు తేల్చిచెప్పారు. అర్జీలపై సత్వరమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణిలు 148 వినతులను వివిధ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారుతో మాట్లాడుతూ అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినపుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించు కోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్‌లో ఎస్పీ మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాస్తవాలైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 10 ఫిర్యాదులు అందగా ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్మీ సీఐ ఆదాం, ఎస్సై ఫకృద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 95 అర్జీలు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల వేదికకు 95 వినతులు వచ్చాయి. మండలంలోని పులిపుట్టి పంచాయితీ కొత్తగూడకు చెందిన సవర ప్రశాంత్‌కుమార్ అటవీపట్టా ఇప్పించాలని అర్జీ ఇచ్చారు. తమకు కుట్టుమిషన్‌లు మంజూరు చేయాలని అనిత,అశ్విని, సంధ్యారాణిలు విన్నవించారు. పులిగుమ్మికి చెందిన కూర్మారావు డైరీఫారం మంజూరు చేయాలని కోరగా సిరికొండ ఒబ్బంగికి చెందిన ఊర్లక శారద ఆశవర్కర్ పోస్టు కావాలని కోరింది. ఆశ్రమపాఠశాలలో అవుట్‌సోర్సింగ్ పోస్టు ఇప్పించాలని దీనబంధు, భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని వాబ గ్రామానికి చెందిన శంకరరావు వినతి ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్, ఏపీడీ సన్యాసిరావు, జీసీసీ మేనేజర్లు డి.కృష్ణ, జి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్

వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు