శ్రావణం.. శుభప్రదం | - | Sakshi
Sakshi News home page

శ్రావణం.. శుభప్రదం

Jul 21 2025 5:01 AM | Updated on Jul 21 2025 5:01 AM

శ్రావ

శ్రావణం.. శుభప్రదం

పాలకొండ కోటదుర్గ ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్న మహిళలు(ఫైల్‌) ఇన్‌ సెట్లో, శ్రావణలక్ష్మిగా ముస్తాబైన వీరఘట్టం శ్రీ కోటదుర్గతల్లి (ఫైల్‌)

ఈ నెల 28 నుంచి మంచి ముహూర్తాలు..

నెల రోజులుగా ఉన్న ఆషాఢ మాసం ఈనెల 22తో ముగియనుంది. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈనెల 28 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభాకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జూలై 26,27,30,31ఆగస్టు నెలలో1,3,4,6, 7, 8, 9, 10, 11, 13,14,17,18 తేదీలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో ఉన్న 17 మంచి ముహూర్తాల్లో జిల్లాలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు.

ఈనెల 25 నుంచి ప్రారంభం

ఆగస్టు 3న స్నేహితుల దినోత్సవం

8న వరలక్ష్మీ వ్రతం

9న రాఖీ పండగ

16న శ్రీకృష్ణ జన్మాష్టమి

పూజలకు సిద్ధమవుతున్న మహిళలు

వీరఘట్టం: సకల శుభాల శ్రావణ మాసం ఈ నెల 25న ఆరంభం కానుంది. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది, అందుచేత మహిళలు ఈరోజును ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. నెల రోజులుగా ఆషాఢం కావడంతో ముహూర్తాలు లేవు.ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈనెల 26న మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్ష్మికి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

నోముల మాసం శ్రావణం..

పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా అభివర్ణిస్తారు. శ్రావణంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పైళెన ఏడాది తరువాత ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు.ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు.

ముఖ్యమైన పండగలు..

శ్రావణ మాసమంతా పండగల సందడి ఉంటుంది.ఈ నెల 26న తొలి శుక్రవారం, ఆగస్టు 1న రెండవ శుక్రవారం, ఆగస్టు 3న ఆదివారం స్నేహితుల దినోత్సవం, ఆగస్టు 8న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 9న రాఖీ పండగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, ఆగస్టు 15న నాల్గవ శుక్రవారం, ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండగలు శ్రావణంలో ఉన్నాయి. ఆగస్టు 22న ఐదవ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది.శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపదం మాసం ఈ ఏడాది ఆగస్టు 27న జరగనున్న వినాయకచవితితో ప్రారంభంకానుంది.

శ్రావణమాసానికి అత్యంత ప్రాధాన్యం

సకల శుభాలను ఒసగే శ్రావణం జ్ఞానస్థితిని అందిస్తుంది. హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణమాసంలో వైష్టవారాధనతో పాటు మహాశివుడికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి.

ఎస్‌వీఎల్‌ఎన్‌ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం

శ్రావణం.. శుభప్రదం1
1/1

శ్రావణం.. శుభప్రదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement