
పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్
● డ్రోన్స్‌తో దాడులు
● ఒకే రోజు 255 ఓడీ, 53 కోప్టా కేసుల నమోదు
● మందుబాబులకు కౌన్సెలింగ్
విజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించినా, విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో సిగరెట్స్, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లుగా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, న్యూసెన్స్ చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. అలాగే వారిపై కేసులు నమోదు చేయాలని, పట్టుబడిన మైనర్లు, మందుబాబులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా లేఅవుట్లు, గ్రామ శివారు ప్రాంతాల్లోను, నగర శివారు ప్రాంతాల్లోను, బహిరంగంగా మద్యం తాగిన వారిపై పోలీసు అధికారులు, సిబ్బంది డ్రోన్స్ తో దాడులు నిర్వహించారు. ఇక విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు చేసే కిరాణా, పాన్ షాపు వ్యాపారులపై కూడా దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కోప్టా చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, జరిమానా విధించామని ఎస్పీ తెలిపారు. ఆదివారం ఒక్కరోజునే 255 కేసులు నమోదు చేశామని పొగాకు ఉత్పత్తులు విక్రయించిన వారిపై 53 కేసులు నమోదు చేసి, జరిమానాగా రూ.8,500 విధించామని ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు.