
రైతుబజారు తొలగించొద్దు.. రైతు బతుకు బుగ్గిపాలు చేయొద్దు
● సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని
సూర్యనారాయణ
విజయనగరం గంటస్తంభం: పాత మహారాజ ఆస్పత్రి వద్ద ఉన్న రైతుబజారును తొలగించవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. అదే రైతుబజారు వద్ద విజయనగరం పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతుబజార్‌ను ఆస్పత్రి వద్దే కొనసాగించాలనే దానికి మద్దతు కూడగడుతూ సంతకాల సేకరణ శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, రైతులతో కలిసి రైతుబజార్‌ను కాపాడుకుంటామన్నారు. 1999 నుంచి రైతుబజారు అక్కడే ఉందని, అప్పటి నుంచి 50 కుటుంబాల వారు అదే బజారుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. నగర ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉన్న ఈ స్థలం ఎమ్మెల్యే అదితిగజపతి, అశోక్ గజపతిరాజులు ఇన్నాళ్లు ఊరుకుని ఇప్పుడు ఆ స్థలం తమదని అప్పగించాలని అనడం సరికాదన్నారు. విద్యాదాతలు, భూ దాతలు అని చెప్పుకునే వారే ఇలా చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అద్దెలు కట్టుకుని, పన్నులు చెల్లించుకుని మరీ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న వారిని తీసేయడమనేది వారి పొట్టకొట్టడమేనన్నారు. ప్రస్తుతం అక్కడ భూమి ఖరీదైనది కాబట్టి ఆ భూమిని లాగేసుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం తప్ప మరొకటి కాదన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి అద్దెలు చెల్లించి రైతుబజారులో కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతు కుటుంబాలను రోడ్డున పడేస్తే ఎలా అని, వారి తరఫున పోరాడుతామన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం బాధ్యత తీసుకుని, రైతుబజారును అక్కడే ఉంచేలా చర్యలు తీసుకోవాలని లేకుంటే పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రామ్‌జీ చాంబర్ ఆఫ్ కామర్స్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు టి.వి.రమణ, అంగన్‌వాడీ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సీఐటీయూ నగర కార్యదర్శి బి.రమణ, అధ్యక్షుడు జగన్‌మోహన్, కేవీపీస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హరీష్ తదితరులు పాల్గొన్నారు.