
నవీన్‌పై పీడీ యాక్టు
విజయనగరం క్రైమ్ : చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రాజాం మండలం గురువాంకు చెందిన కుప్పిలి నవీన్(19)పై పీడీ యాక్టు ప్రయోగించి, ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా నవీన్‌ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. నవీన్ చెడు వ్యసనాలకు అలవాటు పడి, దురుసుగా ప్రవర్తిస్తూ ఇతరులకు హాని కలిగించే విధంగా మారాడని ఎస్పీ పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకే తగదా పడుతూ.. భౌతిక దాడులకు పాల్పడుతూ గత ఐదేళ్లలో రాజాం పోలీస్‌స్టేషన్‌లో నాలుగు, సంతకవిటి పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది కేసుల్లో నిందితుడిగా అరెస్టు అయ్యాడని వెల్లడించారు. నేరాల నియంత్రణకు జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా నవీన్‌పై పీడీ యాక్టు అమలు చేయాలని కోరుతూ రాజాం పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. వాటిని సిఫారసు చేస్తూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ మేరకు నవీన్‌ను నిర్బంధించి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించామని ఎస్పీ తెలిపారు.
హక్కులను సద్వినియోగం చేసుకోవాలి
● కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎస్.విజయచంద్రన్
కొత్తవలస: రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి మహిళా సద్వినియోగ పర్చుకోవాలని కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సముద్రాల విజయచంద్రన్ అన్నారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్వర్యలో శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. చదువే వ్యక్తిగత అభివృద్ధికి మూలమని.. విద్యతోనే అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.వి.శ్రీదేవి, న్యాయవాదులు గొడుగుల మహేంద్ర, డి.శ్రీనివాస్, జీవీ రమణ, వెలుగు ఏపీఎం ఎం.వెంకటరమణ, ఎస్సై సీహెచ్.హేమంత్, తదితరులు పాల్గొన్నారు.