
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
విజయనగరం: ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమైపోయిందని, అయితే ప్లాస్టిక్‌తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని, ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం గంటస్తంభం నుంచి బాలాజీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బాలాజీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మూడవ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం అనే నినాదంతో ప్రభుత్వం రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై ఒక్క రోజులో మార్పు రాదనీ, ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం చూడాలని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా పేపర్, జనప నార, కాటన్‌తో బ్యాగ్‌లను తయారు చేసే యూనిట్లను స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా 12 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ , కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, సీపీవో బాలాజీ, ఆర్డీవో కీర్తి, కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత