
అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం రూ.80లక్షలు
వీరఘట్టం: స్థానిక యూనియన్ బ్యాంకు పక్కనే ఉన్న గోదాంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ప్లాస్టిక్ సంచులతో పాటు జనపనార సంచులు కూడా దగ్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో చెలరేగిన మంటలు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి వచ్చినట్టు పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. ప్రమాదంలో సుమారు 1000 బండిల్స్ ప్లాస్టిక్ టార్ఫాలిన్లతో పాటు టైల్స్ కాలిపోయినట్టు గుర్తించామన్నారు. విలువైన మార్బుల్స్‌తో పాటు గోదాంలో ఉన్న స్లాబ్, గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. సుమారు రూ.80 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశామన్నారు. తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని గోదాం యజమాని కొత్తకోట వెంకటరమణను ఆరా తీశారు. ఆయనతో పాటు వీఆర్‌వో వి.రమేష్‌నాయుడు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. శనివారం ఉదయం పాలకొండ సీఐ ఎం.చంద్రమౌళి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. బాధితునితో మాట్లాడారు.
రూ.10 లక్షల సరుకును కాపాడిన యువత
యూనియన్ బ్యాంకు పక్కన ఉన్న వ్యాపార సముదాయంలో రెండు గోదాంలు ఉండగా ఒక గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటలు పక్కనే ఉన్న గోదాంలోకి వ్యాపిస్తుండడంతో అందులో ఉన్న సుమారు రూ.10 లక్షల విలువ గల గోనె సంచులు ఉన్నాయి. స్థానిక కూరాకుల వీధికి చెందిన శ్రీకృష్ణా సేవా సంఘం యువత వెంటనే స్పందించి పక్క గోదాంలో ఉన్న గోనె సంచులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. యువతకు బాధితుడు వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపాడు.