
ఎస్పీ కార్యాలయంలో డీఐజీ తనిఖీలు
పార్వతీపురం రూరల్: వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ఉన్న పలు ప్రధాన విభాగాలను శనివారం తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ముందుగా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం డీసీఆర్‌బీ, స్పెషల్ బ్రాంచ్, పాస్‌పోర్టు విభాగాలను ఆయన సందర్శించి రికార్డులు నిర్వహణను ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డితో కలసి క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ సెక్షన్లు, వివిధ రకాలుగా నిర్వర్తించే అధికారులు, సిబ్బంది, వారి విధులు వంటి అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా, సైబర్ సెల్ విభాగాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది అందరినీ ప్రశ్నించి వారు రోజువారీ కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన డీఐజీ గోపీనాథ్ జట్టి నిర్వహణ, పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వార్షిక తనిఖీల్లో ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకితా సురాన, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.