
కొత్తపేటలో రెచ్చిపొయిన మట్టి మాఫియా
నెల్లిమర్ల రూరల్:
మండలంలోని కొత్తపేట గ్రామంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా గ్రామ ప్రథమ పౌరుడిపైనే విచిక్షణారహితంగా దాడి చేసి రక్తాన్ని కళ్ల చూశారు. తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో విజయనగరం కేంద్రాస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కొత్తపేటలోని చిన్న జగ్గయ్య చెరువు వేదికగా శుక్రవారం పక్కాపథకంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో మట్టి తవ్వకాల విషయంలో సర్పంచ్ అట్టాడ శ్రీనివాసరావు, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానిక అవసరాల నిమిత్తం సర్పంచ్ మట్టిని తోలేందుకు ప్రయత్నించగా.. తాము మాత్రమే మట్టిని తరలించాలని, ఇతరులు తరలించడానికి వీలు లేదంటూ జనసేన కార్యకర్తలు తనపై దాడికి దిగారని, సువ్వాని రమణ అనే వ్యక్తి రాయితో బలంగా తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి జనసేన కార్యకర్తలు సువ్వానిపేట, కొత్తపేట చెరువుల్లో మట్టిని తరలించుకుపోతున్నారని, రోజూ వేలాది టన్నుల మట్టి తరలిపోతోందని సర్పంచ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా తమకి కూడా గాయాలయ్యాయని జనసేన కార్యకర్తలు సువ్వాని రమణ, గురాన గోవింద, కల్యాణం లోకేష్, పంచాది రమణ, తదితరులు మిమ్స్‌లో చేరడం విశేషం. సర్పంచ్‌పై రక్తం వచ్చినట్లు దాడి చేసి తిరిగి వాళ్లే ఆస్పత్రిలో చేరడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ గణేష్ తెలిపారు.
సర్పంచ్‌పై దాడి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే
కొత్తపేట గ్రామ సర్పంచ్‌పై జనసేన కార్యకర్తలు దాడి చేసి గాయపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. విజయనగరం కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ అట్టాడ శ్రీనివాసరావును ఆయన పరామర్శించారు. దశాబ్దాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నామని, కొట్లాడుకునే సంస్కృతికి ఎప్పుడు తావునివ్వలేదని, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఈ సంస్కృతి ప్రారంభమైందన్నారు. మట్టి తరలింపు విషయంలో సర్పంచ్‌ను రక్తం వచ్చినట్లు కొట్టడం సరికాదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌పై జనసేన కార్యకర్తల దాడి, తీవ్ర రక్తస్రావం
మట్టి తవ్వకాల విషయంలో చెలరేగిన ఘర్షణ
గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్న సర్పంచ్

కొత్తపేటలో రెచ్చిపొయిన మట్టి మాఫియా