
మతోన్మాద శక్తులతో చేతులు కలిపి...
విజయనగరం క్రైమ్:
విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను అందరిలాంటి విద్యా ర్థిగానే ఆ వీధివాసులు భావించారు. పోటీ పరీక్షలకు చదువుతుంటే మంచి విద్యార్థిగానే నమ్మారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నెల 16న అరెస్టు చేశాక ఆయనలోని ఉగ్రవాద భావజాలం తెలిసి నిశ్చేష్టులయ్యారు. జన్మనిచ్చిన స్థలం, ప్రశాంతతకు నిలయం.. అన్నిమతాల వారు ఆనందంగా జీవించేందుకు అనువైన.. కళలకు కాణాచిగా ఉన్న విజయనగరాన్ని ధ్వంసం చేసేందుకు పథక రచన చేశాడన్న వార్తతో ఉలిక్కిపడ్డారు. పోలీసుల రిమాండ్ నివేదికలో ఆయన అంగీకరించిన అంశాలను తెలుసుకుని అమ్మో అంటున్నారు. మతోన్మాద శక్తులతో కలిసి సిరాజ్, సమీర్‌ల ఉగ్రకోణంపై ఎన్‌ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు కూపీలాగుతున్నారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్ నుంచి శుక్రవారం కస్టడీకి తీసుకుని సౌదీతో ఉన్న సంబంధాలు, ప్రత్యేక యాప్‌లో చేసిన చాటింగ్‌లపై ఆరా తీసున్నారు. ఆరేళ్లుగా దేశంలోని ముంబయి, ఉత్తరప్రదేశ్ తదితర చోట్ల జరిగిన మత సమ్మేళనాలకు వీరిద్దరూ హాజరై అక్కడ కలిసిన వ్యక్తుల వివరాలను రాబడుతున్నారు. ఇప్పటికే సిరాజ్ నుంచి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆయా దుకాణాలకు వెళ్లి వివరాలు సేకరించారు.
మతోన్నాదం ఉచ్చులోకి యువతను లాగి..
సిరాజ్, సమీర్‌లు దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచేందుకు పూనుకున్నారు. దీనికోసం ముస్లిం యువతతో ప్రత్యేక బృందాలను నియమించారు. విదేశాల్లోని ఉగ్రమూకల నుంచి వచ్చిన సూచనలు ఆధారంగా మజ్వా–ఇ–హింద్ స్థాపించాలని నిర్ణయించారు. దేశం మొత్తం అలజడులు సృష్టించేందుకు పథకరచన చేశారు. పేలుళ్లతో మారణహోమాన్ని సృష్టించడం, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైనట్టు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. ముందుగా విజయనగరంలోని జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో బాంబులు పేల్చాలని నిర్ణయించారు. ఇద్దరి ఉగ్రవాద భావాలు, వారి కుట్రకోణాలను వారం రోజుల్లో సేకరించే దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు సమాచారం.
విజయనగరం విధ్వంసానికి పథక రచన
తవ్వేకొద్దీ బయటకొస్తున్న సిరాజ్, సమీర్‌ల ఉగ్ర కుట్రకోణం
ప్రత్యేక యాప్‌లో సంభాషణలు
పేలుళ్లకు పథకం
కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్‌ల
నుంచి వివరాలు రాబడుతున్న
పోలీసులు

మతోన్మాద శక్తులతో చేతులు కలిపి...