
దర్యాప్తు నైపుణ్యం మెరుగుపరచడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తులలో నైపుణ్యాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో ఫోరెన్సిక్ నిపుణులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ వైద్యులు పాల్గొని పలు అంశాలపై వివరించి శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ నేరస్థలం పరిశోధనలో దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించాల్సిన సమయంలో అందుకు అనుగుణంగా నేరం జరిగిన చోటుకు పోలీసులు ఏవిధంగా రక్షణ కల్పించాలో, అలాగే డీఎన్‌ఏ, రక్తనమూనాలు, అవయవాలు, వెంట్రుకలు, నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, వివిధ రకాల విషపదార్థాలు, ఆడియో, వీడియో, ప్రధానమైన పలు నేరాలు రుజువు చేసేందుకు అవసరమయ్యే అన్ని సాక్ష్యాధారాలను భౌతికంగా ఏ విధంగా సేకరించాలి? అలాగే ప్యాకింగ్, నిల్వ భద్రపరచడం, ల్యాబ్ నుంచి వచ్చే నివేదికను వారంలోనే పొందే విధానం, కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి ప్రధానమైన అంశాలపై వర్క్‌షాప్ జరిగినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఫోరెన్సిక్ నిపుణులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ వర్క్‌షాపులో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సీఐ అప్పారావు, ఫోరెన్సిక్ నిపుణులు ఎం.రాంబాబు, ఎస్.నళిని, వి.ప్రశాంతి, గోపాలకృష్ణతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ వైద్యులు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు, ఎస్సైలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి

దర్యాప్తు నైపుణ్యం మెరుగుపరచడమే లక్ష్యం