
స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్‌సెంటర్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న పెళ్లి కారు రాయగడ రోడ్డులోని గ్రోత్ సెంటర్‌లో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వేగానికి పక్కనే ఉన్న కాలువలోకి పక్కకి ఒరిగి పోయింది. ఈ సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు కారులోని పెళ్లి బృందాన్ని బయటకు తీశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం, కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు బలగ సాయికృష్ణ కుమార్తె పెళ్లి అనంతరం జరిగిన ఈ ఘటనలో కారులో సాయికృష్ణతో పాటు నలుగురు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ఘటన సంగతి తెలుసుకున్న బొబ్బిలి సీఐ కె.సతీష్‌కుమార్ తన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి ప్రయాణికుల క్షేమ సమాచారాలను కనుగొన్నారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.